
– జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే
నవతెలంగాణ – భువనగిరి రూరల్
మార్చి 3 వ తేదీన 0- 5 వయస్సు గల తమ పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే కోరారు. గురువారం నాడు కాన్ఫరెన్స్ హాలులో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమ ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షిస్తూ వచ్చే మార్చి 3వ తేదీ ఆదివారం నాడు జాతీయ పోలియో దినోత్సవం (నేషనల్ ఇమునైజేషన్ డే) పురస్కరించుకొని జిల్లాలో పల్స్ పోలీయో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 63,405 మంది 0- 5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించడం జరిగిందని, వీరందరికి 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 420 పోలియో కేంద్రాల ద్వారా 1680 మంది సిబ్బందిని, 68 మంది రూట్ సూపర్వైజర్లను నియమించడం జరిగిందని తెలిపారు. 56 మొబైల్ టీములు పనిచేస్తాయని తెలియజేస్తూ, వీటితోపాటు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, జన సమూహాలు అధికంగా ఉండే 17 ట్రాన్సిస్ట్ ప్రాంతాలను, 319 హై రిస్క్ ఏరియాలను గుర్తించడం జరిగిందని, 0 -5 వయసు గల చిన్నారులు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. మార్చి 3 వ తేదీన జరిగే ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో మిగిలిన చిన్నారులకు మరుసటి 4, 5 తేదీలలో ఇంటింటికి తిరిగి పోలీయో చుక్కలను వేయడం జరుగుతుందని, 0-5 సంవత్సరాల వయసు గల తమ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని, పోలియో నివారణకు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా పరిపూర్ణ చారి, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.