గోనె సంచులు లేక నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు 

– కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సీపీఐ(ఎం) బృందం 
నవతెలంగాణ-చేర్యాల 
 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే గోనె సంచుల కొరతను నివారించి నిలిచిపోయిన ధాన్యం కొనుగోలను వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ముస్త్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ(ఎం) బృందం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట మావో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గోనె సంచులు లేక ధాన్యం మ్యాచర్ వచ్చినప్పటికీ కాంటాలు నిలిచిపోయాయని తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో  వసతులు కల్పిస్తామన్న ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించలేదని విమర్శించారు.  ధాన్యాన్ని ఆరబోసుకునే ప్లాస్టిక్ పరదాలు లేకపోవడం వల్ల ప్రతి రైతు పరదాలను అద్దెకు తెచ్చుకోవడంతో  రైతు రూ.1000  నుండి 5000 వరకు నష్టపోతున్నారని అన్నారు. తాలుపట్టే మిషనరీలు సరిగా లేకపోవడం రిపేర్లతో కూడి ఉండడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి  ఏమాత్రం తరుగు, కోత లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో  నాయకులు రేపాక కుమార్, గుండ్ర రవీందర్, కొంగరి చంద్రమౌజుందార్, చింతల లింగం, రైతులు జగన్మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి, జీవన్ రెడ్డి, శివాజీ, అంజిరెడ్డి, మల్లేశం, రేపాక లింగం తదితరులు పాల్గొన్నారు.
Spread the love