పీవీ జీవితం ఆదర్శనీయం

పీవీ జీవితం ఆదర్శనీయం– మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ-భీమదేవరపల్లి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితం అందరికీ ఆదర్శనీయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వగ్రామం వంగరలో ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. భారతదేశానికే కాకుండా ప్రపంచానికి పీవీ నరసింహారావు ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. భూ సంస్కరణలు, విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన ఘనత పీవీకి దక్కిందన్నారు. నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చి దేశంలో విద్యావ్యవస్థను పటిష్టం చేశారన్నారు. పీవీ స్ఫూర్తి, ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. వంగరలో వాటర్‌ ప్లాంట్‌, రోడ్లు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే రైతులకు రుణమాఫీ అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మెన్‌, మాజీ ఎంపీ రాజయ్య, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, పీవీ కుటుంబ సభ్యులు పీవీ మదన్‌ మోహన్‌, శరత్‌, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love