నవతెలంగాణ – కామారెడ్డి
పోలీసు సేవలను వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు సీసీటీఎన్ఎస్-2.0 (CCTNS-2.0)తో పాటు ఆధునిక పోలీసింగ్ సాఫ్ట్‌వేర్‌లపై జిల్లా స్థాయి రైటర్లకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, పాల్గొని పోలీసు సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించడం ప్రతి పోలీసు అధికారిపై ఉన్న బాధ్యత అని అన్నారు. కేసుల దర్యాప్తు, విచారణలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి వివరాన్ని సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. సాక్షుల వాంగ్మూలాలను ఖచ్చితంగా నమోదు చేయడం ద్వారా కేసుల విచారణ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
మారుతున్న అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్‌లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించడం ద్వారా పోలీసు సేవల నాణ్యత పెరగడంతో పాటు ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత బలపడుతుందని తెలిపారు. ప్రజలకు సమయానికి న్యాయం లభిస్తేనే చట్టంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతి పోలీసు అధికారికి అత్యంత ముఖ్యమైన బాధ్యత” అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఇతర పోలీసు అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, సీఐ, డీఎస్పీ కార్యాలయాల రైటర్లు పాల్గొన్నారు.



