విద్యారంగంలో సమూల మార్పులు

Radical changes in education– ఆకునూరి మురళీ నేతృత్వంలో విద్యాకమిషన్‌
– రేవంత్‌ సర్కారు సమాయత్తం
– పలు సంఘాలు, సంస్థలతో కార్యాచరణ
– విస్తృత సంప్రదింపులతో కొత్త విధానం ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సర్కారు భావిస్తున్నది. సమూల మార్పుల ద్వారా విద్యావ్యవస్థను కొత్త పుంతలు తొక్కించేందుకు సమాయత్తమవుతున్నది. భారీ సంస్కరణలతో విద్యారంగాన్ని సమాజానికి దగ్గర చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే అనధికారికంగా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని రాష్ట్ర విద్యాకమిషన్‌ చైర్మెన్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ నేత, ఏఐసీసీ నాయకులు మాజీ ఐఏఎస్‌ కొప్పుల రాజు మార్గదర్శకత్వంలో విద్యారంగంలో మార్పులు చోటుచేసుకోనున్నట్టు సమాచారం. కాగా ఈ సంస్కరణలు చేసేందుకు రాష్ట్రంలోని మేథావులు, సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతరుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆకునూరి మురళి గత బీఆర్‌ఎస్‌ సర్కారు అనుచిత వైఖరికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఏపీ ప్రభుత్వంలో విద్యాశాఖ సలహాదారుగా పనిచేశారు. అక్కడ నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా మలిచేందుకు కృషి చేశారు. నిరంతరం స్కూళ్లను పర్యవేక్షిస్తూ పాఠశాలల్లో భారీగా మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రయత్నించారు. ఆ తరహాలోనే కొత్త అంశాలను జోడిస్తూ తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలను చేపట్టాలనే లక్ష్యంగా విద్యాకమిషన్‌ను రూపుదిద్దనున్నట్టు తెలిసింది. ఇతమిద్దంగా కమిషన్‌ విధివిధానాలు ఖరారు కానప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను అందు బాటులోకి తేవడంతోపాటు ఉపాధ్యాయుల బోధనా నైపు ణ్యాలను సైతం బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారని భావిస్తున్నారు. మురళీ నియామకం ఉత్తర్వులు అధికారికంగా వెలువడనప్పటికీ, ఆయన ఇప్పటికే విధుల్లో చేరిపోయారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలు ,సలహాలు, సూచనలు సేకరించే పనిలో పడ్డారు. ఈనెల 26న హైదరాబాద్‌లో ఖమ్మం- నల్లగొండ-వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవితోపాటు ఇతరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులు గురించి చర్చించినట్టు తెలిసింది. విధానంతోపాటు సమూల మార్పులు తేవాలంటే నిధులు సైతం భారీగా అవసరమవుతాయి. వాటిని సైతం విద్యారంగానికి కేటాయించేలా కమిషన్‌ విధివిధానాల్లోనే పొందుపరిచేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్‌ అయిన ఆకునూరి మురళి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌)లో దీర్ఘకాలం విధులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ తన శక్తి సామర్థ్యాలను పేదల కోసం ఉపయోగపడేలా కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త విద్యావిధానాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. మానవ జీవితం చదువుతో కీలకంగా ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. ఆ చదువు నాణ్యంగా ఉండేలా విద్యాకమిషన్‌ పని చేయనుంది. ఆర్థికపరమైన అంశాలతోపాటు సామాజిక వ్యవహారాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న విషయం విదితమే. వీటన్నింటిలోనూ చదువుదే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యవస్థను గాడిన పెట్టడం ఈ కమిషన్‌ చేయాలని ఆశిస్తున్నారు. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లోని పాఠశాలల పరిస్థితులపై అవగాహన ఉన్న మురళి భాషకు సంబంధించిన అంశాల పై కూడా అభిప్రాయసేకరణ చేస్తున్నట్టు సమా చారం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష లేకుండా మనుగడ లేదనే భౌతిక వాస్తవాన్ని అంగీకరిస్తూ ప్రభుత్వ విద్యారం గాన్ని ఆ దిశగా ముందడుగు వేయించే అంశాలనూ ఆకునూరి మురళి పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
విద్యావ్య వస్థలో మెరుగైన ఫలితాల సాధనకు స్కూళ్లు మూసి వేయడం కాకుండా తరగతి గదులను పెంచడం , ఆమేరకు ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. తద్వారా చదువు నాణ్యంగా అందడానికి వీలుం టుందని టీఎస్‌యూటీఎఫ్‌ నాయకత్వం సూచించినట్టు సమాచారం. అలాగే రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు సైతం భారీగానే కేటాయించాల్సి రావచ్చు. ప్రస్తుత రేవంత్‌ సర్కారు బడ్జెట్‌లో విద్యారం గానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన సంగతి తెలిసిందే. కాగా 13 శాతం కేటాయించినా అద్భుత ఫలితాలు రాబట్ట వచ్చనే భావనతో ఆకునూరి మురళి ఉన్నట్టు సమా చారం. సర్కారు లక్ష్యంగా బాగానే ఉన్నా, ఇప్పటికే నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం, రేవంత్‌ ప్రభుత్వ తాజా విద్యా విధానాన్ని అడ్డుకుంటుందా ? లేక స్వాగతిస్తుందా ? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Spread the love