విపక్ష నేతగా రాహుల్ గాంధీ…

నవతెలంగాణ – హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో కూటమి తరఫున విపక్ష నేతగా ఎన్నికయ్యారు. నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. వారందరూ లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ కు మద్దతు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలందరూ లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని బలపరిచారని తెలిపారు. స్పీకర్ పదవి కోసం తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతున్న నేపథ్యంలో, ఇండియా కూటమి నుంచి విపక్ష నేత ప్రకటన వెలువడింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి అభ్యర్థికి ఇచ్చేందుకు ఎన్డీయే ససేమిరా అనడంతో, స్పీకర్ పదవికి ఎన్నిక జరపాల్సిందేనని ఇండియా కూటమి పట్టుబట్టడం తెలిసిందే. లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్డీయే తరఫున ఓం బిర్లా బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో కేరళ ఎంపీ కె. సురేశ్ ను పోటీలోకి దించింది.

Spread the love