నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక కేకులు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న రాహుల్

నవతెలంగాణ-హైదరాబాద్ : రాయబరేలితో తన కుటుంబ సభ్యులకు, తనకు ఉన్న అనుబంధాన్ని, తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తన సోదరి ప్రియాంక గాంధీకి, తనకు మధ్య జరిగిన సంభాషణల వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. దేశం సాధించిన పురోగతిలో రాయబరేలిది కీలక పాత్ర అని, ఒకప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో ఈ ప్రాంతం దిశానిర్దేశం చేసిందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కూడా కేంద్రంగా ఉండేదని రాహుల్ ఈ వీడియోలో పేర్కొన్నారు. రాయబరేలి నుంచి మరోసారి దేశానికి పురోగతి, అభివృద్ధి పథాన్ని చూపాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాజకీయాలు, కుటుంబ సంబంధాలపై బీజేపీ నేతలపై పరోక్షంగా రాహుల్ విసుర్లు విసిరారు. తన కుటుంబ సభ్యులను తాను గౌరవిస్తానని, అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తుంటానని, తమ మధ్య రాజకీయాలకు తావుతుండదని చెప్పారు. ”మీరు కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వకపోతే బయట సత్సంబంధాలు కొనసాగించలేరు. నిత్య జీవితంలో మీరు అబద్ధాలు చెబుతూ పోతుంటే రాజకీయాల్లోనూ అబద్ధాలు అలవాటుగా మారుతాయి” అని రాహుల్ అన్నారు. రాయబరేలి వెళ్లినప్పుడు తాను, ప్రియాంక అక్కడ గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటామని, నానమ్మ జ్ఞాపకాలు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక తయారు చేసిన కేకులు, ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు మా కళ్ల ముందు మెదులుతుంటాయని రాహుల్ చెప్పారు. ఇవన్నీ నిన్నే జరిగినట్టు అనిపిస్తుంటుందన్నారు. తమకు చిన్నప్పటి నుంచి రాజకీయాలతో ప్రగాఢమైన అనుబంధం ఉందని, అయితే తమ మధ్య ఎప్పుడూ రాజకీయాలకు తావులేదని ఆ వీడియోలో తెలిపారు.

Spread the love