రాహుల్‌ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి : బూర

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు బీసీల మనస్సుల్ని గాయపర్చిందనీ, ఆయన తన మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని హోటల్‌ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌కు బీసీని సీఎం చేసే దమ్మూ, ధైర్యం చేయలేదని విమర్శించారు. దేవేగౌడ ప్రధాని అయితే పది నెలల్లో పడగొట్టి బీసీ వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్‌ నిరూపించుకున్నదన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ..నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణలో అది నెరవేరలేదన్నారు. రూ.30 వేల ప్రాజెక్టును లక్షా 30 వేల కోట్ల రూపాయలకు తీసుకుపోయారని విమర్శించారు. రైతులకు నీళ్లిస్తామంటూ లక్ష కోట్ల రూపాయలను మింగేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేసిన ఇంజినీర్లపై చర్చలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం వరల్డ్‌ వండర్‌ కాదు..వరల్డ్‌ బ్లెండర్‌ మిస్టేక్‌ అని విమర్శించారు. కాళేశ్వరం నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ మాత్రం లేదన్నారు.

Spread the love