రామంతపూర్‌ పెద్దచెరువు కలుషితం కానీయొద్దు

– హైకోర్టు
నవతెలంగాణ – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని రామంతపూర్‌ పెద్దచెరువు నీటి కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు చుట్టూ కంచె వేయాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని 562 చెరువులు ఉండేవని, ఆక్రమణలకు గురౌతున్నా యని, రామాంతపూర్‌లోని పెద్ద చెరువు 25 ఎకరాలను డంపింగ్‌ యార్డుగా మార్చకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కేఎల్‌ వ్యాస్‌ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది.
నీటివనరుల పరిరక్షణతో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడ వచ్చునని, జలచరాలను, పశుపక్ష్యాదులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని హైకోర్టు చెప్పింది. చెరువుల రక్షణ చర్యలకు తమకు సంబంధం లేదని ఒక శాఖపై మరో శాఖ చెప్పడాన్ని తప్పుపట్టింది. రామాంతపూర్‌లోని పెద్ద చెరువు పరిరక్షణఖు తీసుకున్న చర్యలు నివేదించాలని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌ కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ లాయర్‌ వాదిస్తూ, పెద్దచెరువు నీటికాలుష్యం కాకుండా గతంలోని హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. చెరువులో చెత్త వేయకుండా నోటీసు బోర్డులు పెట్టామన్నారు.
గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు జరుగుతున్నాయని చెప్పారు. చెరువు ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది.

Spread the love