కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ అవినీతి

– యాక్షన్‌ ఎప్పుడో ప్రారంభమైంది : ప్రకాశ్‌ జవదేకర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారనీ, దానిపై యాక్షన్‌ ఎప్పుడో ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తొమ్మిదేండ్లలో టీచర్‌, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టలేదన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లూ లీకేజీ మయంగా మారాయని విమర్శించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆయన కుటుంబ సభ్యులైన కేటీఆర్‌, కవిత, సంతోష్‌, హరీశ్‌రావులకు మాత్రమే ఉపాధి దొరికిందన్నారు. కేసీఆర్‌ తన పర్యటనల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేయించడాన్ని తప్పుబట్టారు. మాజీ మంత్రి, మహిళ అని చూడకుండా డీకే అరుణను అరెస్టు చేయడాన్ని ఖండించారు. తమ పార్టీలోకి వచ్చేవాళ్లే తప్ప పోయేవాళ్లు లేరని చెప్పారు. ఈ నెల 27 తర్వాత రాష్ట్రంలో ఏం జరుగబోతుందో అందరూ చూస్తారన్నారు. తాము ప్రజల కోసం పోరాడుతున్నామనీ, అరెస్టులు, దాడులకు తమ పార్టీ కార్యకర్తలు భయపడరని చెప్పారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థుల తొలి లిస్టు వస్తుందని చెప్పారు.
అభద్రతా భావంతోనే రెండు చోట్ల కేసీఆర్‌ పోటీ : డీకే
అభద్రతా భావంతోనే కేసీఆర్‌ రెండు చోట్ల పోటీచేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ మోసాలపై ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్లాన్‌గా ముందుకెళ్తూ బీజేపీని టార్గెట్‌ చేశాయని చెప్పారు. మహేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు నిర్మల్‌కు వెళ్తున్న తనను అరెస్టు చేయడం దారుణమనీ, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం అన్యాయమని తెలిపారు.

Spread the love