మోర్చాలన్నీ సమన్వయంతో ముందుకెళ్లాలి

– 23,24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు : ఎంపీ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
డిసెంబర్‌లో ఎన్నికలు రాబోతున్నాయనీ, రాష్ట్రంలో బీజేపీ అనుబంధ మోర్చాలన్నీ సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ అనుబంధ మోర్చాల సంయుక్త సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్‌ బన్సల్‌, బండి సంజరు, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, నేతలు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ..రైతు బంధు పేరుతో కేసీఆర్‌ మిగతా పథకాలన్నీ బంద్‌ చేశారని విమర్శించారు. రైతుల వ్యతిరేక విధానాలపై కిసాన్‌ మోర్చా, నిరుద్యోగ సమస్యలపై యువ మోర్చా గలమెత్తాలని కోరారు. దళిత బంధు పేరుతో చేస్తున్న దగాను దళిత మోర్చా ఎండగట్టాలన్నారు. మద్యం వల్ల జరుగుతున్న అనర్థాలు, లైంగిక దాడులపై ప్రజలకు మహిళా మోర్చా నాయకులు విడమర్చి చెప్పాలన్నారు. దక్షిణాదిలో బీజేపి కి ఆదరణ లేకున్నా .. దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల మందికి మోడీ ఇండ్లు కట్టిస్తే తెలంగాణలో కేసీఆర్‌ లక్ష ఇండ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. రాజీవ్‌ గాంధీ హయాంలో 100 రూపాయలు విడుదల చేస్తే 15 రూపాయలు మాత్రమే లబ్ధిదారులకు అందేవన్నారు. మోడీ హయాంలో ప్రతి పైసా లబ్దిదారులకు చేరుతున్నదన్నారు.

Spread the love