ప్రభుత్వ భూముల్లో ‘రియల్‌’ దందా

– ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం తెగించి పోరాడాలి : తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య
నవతెలంగాణ-వరంగల్‌
వరంగల్‌ నగరంలో ప్రభుత్వ భూములను రియల్‌ ఎస్టేట్‌ గద్దలు తన్నుకు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వాటిని స్వాధీనం చేసుకొని ఇండ్లు లేని పేదలకు పంచాలని, లేని పక్షంలో వాటిని సాధించేవరకూ తెగించి పోరాడుతామని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య పిలుపునిచ్చారు. ఈనెల 18న మహబూబాబాద్‌లో ప్రారంభమైన బస్సు యాత్ర బుధవారం మధ్యాహ్నం వరంగల్‌ జిల్లా రంగశాయిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీరయ్య మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌కు వచ్చినప్పుడు.. గుడిసెలు లేని నగరంగా వరంగల్‌ను మారుస్తామని ఇచ్చిన హామీ అమలుకాలేదన్నారు. పైగా నగరంలోని ప్రభుత్వ భూములు, మిగులు, శిఖం, దేవాదాయ భూముల్లో పెద్ద పెద్ద భవంతులు వెలుస్తున్నాయన్నారు. రంగురంగుల అద్దాలమేడలు నిర్మించుకొని దావతుల మీద దావతులు చేసుకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు ముఖ్యమంత్రికి కనబడట్లేదాని ప్రశ్నించారు.
ఏడాది పొడుగునా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, కానీ ఉత్సవాల్లో పేదల గుడిసెల కోసం ఒక్కరోజు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ వస్తే అన్ని వస్తాయనుకుంటే, ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇంత వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో సామాన్యుడు జాగ కొనుక్కుని.. ఇల్లు కట్టుకునే స్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 125 గజాల స్థలం ఇవ్వాలని పోరాడుతున్నట్టు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆవాస్‌ యోజన పథకాన్ని ప్రారంభించి పేదలందరికీ ఇంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి మోసగించిందన్నారు.
భూ పోరాటం ప్రారంభించి ఏడాది దాటినా గుడిసెల గురించి ముఖ్యమంత్రి కానీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరూ నేటికీ పెదవి విప్పలేదన్నారు. మహబూబాబాద్‌లో రెవెన్యూ మున్సిపల్‌, పోలీస్‌ అధికారులు అంతా రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో కుమ్మక్కై దుర్మార్గమైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మహబూబాద్‌ జిల్లాలో 40 శాతం మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నారని, వాళ్ళు పోయి గుడిసెలు వేసుకుంటే పోలీసులు లాఠీలు ఝులిపించడం అత్యంత దారుణమన్నారు.ఈ నెల18వ తేదీ బస్సు యాత్ర మహబూబాబాద్‌లో ప్రారంభమైందని, మరుసటి తెల్లారే స్థానిక ఎమ్మెల్యే సందర్శించి పేదలకు భరోసా ఇస్తాడని అనుకుంటే గుడిసెలను పీకేసీ దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు న్నారని, వారి అణిచివేతతో ఉద్యమాలు ఎక్కడా ఆగలేదన్నారు.
వరంగల్‌ జిల్లాలో 30 ఏండ్లుగా ఖాళీ స్థలాల్లో గుడిసె వేసుకొని ఎంతోమంది స్థిరపడి జీవిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధతం చేయడం కోసమే ఈ యాత్ర సాగుతోందని అన్నారు. ఈ నెల 27 వరకు సాగే ఈ బస్సు యాత్ర ముగింపు లోపు రాష్ట్ర ప్రభుత్వం గుడిసె వాసులకు అందరికీ పట్టాలిస్తామని, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించకపోతే 27 సాయంత్రం బహిరంగ సభ నుంచి సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

Spread the love