‘ సికింద్రాబాద్‌’ కు బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తల నియామకం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్‌ పార్లమెంటుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. పార్టీ సీనియర్‌ నాయకులు షేక్‌ అబ్దుల్లా సోహెల్‌, (జూబ్లీహిల్స్‌), తెలంగాణ ఫుడ్స్‌ మాజీ చైర్మెన్‌ రాజీవ్‌ సాగర్‌ (సికింద్రాబాద్‌), సీనియర్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌ (అంబర్‌ పేట్‌), మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ (నాంపల్లి)తో పాటు ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తల పేర్లను ప్రకటించారు.
పార్టీ కార్యాలయాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించాలని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికల కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పూర్తిగా నిమగమైన నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయాల్లో జరుపుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యవర్గాలతో పాటు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌), రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు కృషి చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతులు, శ్రామికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిందని తెలిపారు. రానున్న రోజుల్లోనూ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం 9 గంటలకు ఆయన గులాబీ జెండాను ఎగురేసి ఆవిర్భావ దినోత్సవ జెండాలను లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఆ నైతిక హక్కు కాంగ్రెస్‌ నాయకులకు లేదు : బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌
అమరుల స్థూపాన్ని తాకే నైతిక హక్కు కాంగ్రెస్‌ నాయకులకు లేదని బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కాంగ్రెస్‌ కుట్ర కారణంగానే 369 మంది అమరులయ్యారనీ, వారికి నివాళిగా అమరవీరుల స్థూపాన్ని నిర్మించారని తెలిపారు. సీఎం సవాల్‌ను స్వీకరించిన తమ నేత హరీశ్‌ రావు రాజీనామాతో లేఖతో వచ్చారని చెప్పారు. అమరవీరుల స్థూపం చరిత్ర రేవంత్‌ రెడ్డికి గానీ, ఆయన అనుచరలకు గానీ తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు సమైక్యవాదుల తొత్తులు..వారు పెంచుతున్న కుక్కలని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌ రావు డిమాండ్‌ చేసిన రుణమాఫీ గురించి మాట్లాడకుండా సీఎం రేవంత్‌ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ దళితులకు మూడెకరాల భూమిని కొనిచ్చిందనీ, భూముల రేట్లు పెరగడంతో దళిత బంధు పథకం తెచ్చిందని గుర్తుచేశారు.

Spread the love