262 ఉఫ్

262 ఉఫ్– పంజాబ్‌ కింగ్స్‌ రికార్డు ఛేదన
– బెయిర్‌స్టో, శశాంక్‌ సింగ్‌ అదుర్స్‌
– కోల్‌కత 261/6, పంజాబ్‌ 262/2
ఈడెన్‌గార్డెన్స్‌లో రికార్డులు బద్దలయ్యాయి. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే రికార్డు లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ ఊదేసింది. 262 లక్ష్యాన్ని మరో 8 బంతులు ఉండగానే ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జానీ బెయిర్‌స్టో (108 నాటౌట్‌), శశాంక్‌ సింగ్‌ (68 నాటౌట్‌) ఊచకోత ఇన్నింగ్స్‌లో విశ్వరూపం చూపించారు. కోల్‌కత ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (75), సునీల్‌ నరైన్‌ (71) చెలరేగటంతో ఆ జట్టు తొలుత 261 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
నవతెలంగాణ-కోల్‌కత
జానీ బెయిర్‌స్టో (108 నాటౌట్‌, 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (68 నాటౌట్‌, 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు), ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (54, 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఊదేశారు. అసాధ్యమనుకున్న ఛేదనలో టాప్‌-4 బ్యాటర్లు ఊహకందని బ్యాటింగ్‌ ప్రదర్శన చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో ప్రపంచ రికార్డు విజయం సాధించింది. అంతకుముందు,
ఫిల్‌ సాల్ట్‌ (75, 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్‌ నరైన్‌ (71, 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (39, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (28, 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), అండ్రీ రసెల్‌ (24, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా కోల్‌కత నైట్‌రైడర్స్‌ 261/6 పరుగులు చేసింది.
అసాధ్యం సుసాధ్యం! : 262 పరుగుల లక్ష్యం. టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇంతటి లక్ష్యాన్ని ఏ జట్టూ ఛేదించలేదు. వరుస పరాజయాల నైరాశ్యంలో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ సగంలోనే చేతులెత్తేస్తుందని అనుకున్నారు. కానీ పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (108 నాటౌట్‌) అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఖరు వరకు ఓ ఎండ్‌లో నిలిచి పరుగుల వరద పారించిన బెయిర్‌స్టో 45 బంతుల అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్‌ ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (54)తో కలిసి బెయిర్‌స్టో తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలోనే 93 పరుగులు జోడించి ఛేదనకు గట్టి పునాది వేశాడు. రికార్డు ఛేదనలో మంచి ఆరంభం దక్కినా.. మిడిల్‌ ఓవర్లలో వెనక్కి తగ్గటం ఎన్నో మ్యాచుల్లో కనిపించినా.. పంజాబ్‌ ఆ పొరపాటు చేయలేదు. రౌసో (26) జతగా ముందుకు సాగిన బెయిర్‌స్టో… ఆ తర్వాత శశాంక్‌ సింగ్‌ (68 నాటౌట్‌)తో జతకట్టి లాంఛనం ముగించాడు. 24 సిక్సర్లు, 15 ఫోర్లతో దండెత్తిన పంజాబ్‌ బ్యాటర్లు మరో 8 బంతులు ఉండగానే ప్రపంచ రికార్డు సృష్టించారు. కోల్‌కత స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (1/24) కండ్లుచెదిరే మాయజాలం ప్రదర్శించినా.. ఇతర బౌలర్లను బెయిర్‌స్టో, శశాంక్‌ సింగ్‌ ఊచకోత కోశారు. ప్రభుసిమ్రన్‌ 18 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. బెయిర్‌స్టో 23 బంతుల్లో అర్థ సెంచరీ.. 45 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. శశాంక్‌ సింగ్‌ సైతం 23 బంతుల్లో అర్థ సెంచరీ మార్క్‌ చేరుకున్నాడు.

Spread the love