125 పట్టణాల్లో వీఐటీ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత్‌లోని 125 పట్టణాలు, విదేశాల్లో ఆరు నగరాల్లో వీఐటీ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 19న ప్రారంభమైన ఈ పరీక్షలు 30 వరకు నిర్వహిస్తారు. విదేశాల్లో దుబాయి, మస్కట్‌, ఖతార్‌, కువైట్‌, సింగపూర్‌, కౌలాలంపూర్‌లో పరీక్ష కేంద్రాలున్నాయి. వచ్చేనెల మూడో తేదీన ఫలితాలను విడుదల చేస్తారు. అదేరోజు నుంచి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. లక్ష ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశమున్నది. వచ్చేనెల ఏడు, ఎనిమిది తేదీల్లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఒకటి నుంచి 20 వేల ర్యాంకుల వారికి, 18,19 తేదీల్లో జరిగే రెండో విడత కౌన్సెలింగ్‌లో 20,001 నుంచి 45 వేల ర్యాంకుల వారికి, అదేనెల 29,30 తేదీల్లో నిర్వహించే మూడో విడత కౌన్సెలింగ్‌లో 45,001 నుంచి 70 వేల ర్యాంకుల వారికి, జూన్‌ తొమ్మిది, పది తేదీల్లో జరిగే నాలుగో విడత కౌన్సెలింగ్‌లో 70,001 నుంచి లక్షల ర్యాంకుల వారికి ప్రవేశాలను కల్పిస్తారు. లక్ష ఆపైన ర్యాంకుల వారికి వీఐటీ-ఏపీ, వీఐటీ-భోపాల్‌లో సీట్లు కేటాయిస్తారు. జూన్‌ 20,21 తేదీల్లో అందుకు సంబంధించిన కౌన్సెలింగ్‌ జరుగుతుంది. జులై రెండో వారంలో వీఐటీ ప్రాంగణాల్లో ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభమవుతాయి.

Spread the love