ఈడెన్‌లో ఊచకోత

Massacre in Eden– సాల్ట్‌, నరైన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌లు
– కోల్‌కత నైట్‌రైడర్స్‌ 261/6
22 ఫోర్లు, 18 సిక్సర్లతో మోతమోగిన ఈడెన్‌గార్డెన్స్‌లో రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్న కోల్‌కత నైట్‌రైడర్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌పైనా చెలరేగింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (75), సునీల్‌ నరైన్‌ (71) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఈ ఇద్దరు దంచికొట్టగా కోల్‌కత నైట్‌రైడర్స్‌ 261 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది ఆరో అత్యధిక స్కోరు కావటం గమనార్హం.
నవతెలంగాణ-కోల్‌కత
నైట్‌రైడర్స్‌ బ్యాటర్ల విధ్వంసానికి హద్దు లేదు. కోల్‌కత జోరుకు ఎదురు లేదు. కోల్‌కత నైట్‌రైడర్స్‌ విధ్వంసక ప్రయాణం పంజాబ్‌ కింగ్స్‌పైనా కొనసాగింది. ఈడెన్‌గార్డెన్స్‌లో శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ 261/6 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (75, 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్‌ నరైన్‌ (71, 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక అర్థ సెంచరీలతో కదం తొక్కారు. వెంకటేశ్‌ అయ్యర్‌ (39, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (28, 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), అండ్రీ రసెల్‌ (24, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ (1/33) పరుగుల నియంత్రణతో పాటు ఓ వికెట్‌ పడగొట్టి ఆకట్టుకున్నాడు.
ఓపెనర్ల ఊచకోత : టాస్‌ నెగ్గిన పంజాబ్‌ కింగ్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సొంతగడ్డపై బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం అందించారు. ఇన్నింగ్స్‌ తొలి ఏడు ఓవర్లలో ఓపెనర్లను అవుట్‌ చేసేందుకు లభించిన మూడు అవకాశాలను పంజాబ్‌ కింగ్స్‌ వృథా చేసుకుంది. పేలవ ఫీల్డింగ్‌తో మూడు క్యాచులు నేలపాలు చేసింది. జీవనదానం పొందిన ఓపెనర్లు పంజాబ్‌ కింగ్స్‌కు కోలుకోలేని పంచ్‌ ఇచ్చారు. పవర్‌ప్లేలో 76 పరుగులు చేసిన ఓపెనర్లు ఆ తర్వాత వెనక్కి తగ్గలేదు. సునీల్‌ నరైన్‌ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించగా.. ఫిల్‌ సాల్ట్‌ 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ శతకం అందుకున్నాడు. పంజాబ్‌ బౌలర్లలో కరణ్‌, అర్షదీప్‌, హర్షల్‌ పటేల్‌, కగిసో రబాడ అందరూ ఓపెనర్ల ఊచకోతకు గురయ్యారు. 10.2 ఓవర్లలోనే 138 పరుగులు జోడించిన సునీల్‌ నరైన్‌, ఫిల్‌ సాల్ట్‌లు కోల్‌కతకు రికార్డు స్కోరు ఖాయం చేసుకున్నారు. స్వల్ప విరామంలోనే ఓపెనర్లు ఇద్దరూ వికెట్‌ కోల్పోయినా.. కోల్‌కత నైట్‌రైడర్స్‌ ట్రాక్‌ తప్పలేదు. వెంకటేశ్‌ అయ్యర్‌ (39) తోడుగా ఫిల్‌ సాల్ట్‌ దండిగా పరుగులు పిండుకోగా.. ఆ తర్వాత అయ్యర్‌తో కలిసి రసెల్‌ దండయాత్ర చేశాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (28) సైతం ఈసారి విశ్వరూపం చూపించాడు. 10 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో రఫ్పాడించాడు. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ నాలుగు ఓవర్ల స్పెల్‌లో బ్యాటర్లను కాస్త కట్టడి చేశాడు. రింకూ సింగ్‌ (5) నిరాశపరిచాడు. 20 ఓవర్లలో 6 వికెట్లకు కోల్‌కత నైట్‌రైడర్స్‌ 261 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.

Spread the love