రంజిత్‌రెడ్డి ఒంటెద్దు పోకడల తీరు మార్చుకోవాలి

– కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శినేనుగు రవీందర్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్‌పల్లి
చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి ఒంటెద్దు పోకడలు మానుకోవాలని కాంగ్రెస్‌ శంకర్‌పల్లి మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షులు ఎండి నసీరుద్దీన్‌లు హితవు పలికారు. శుక్రవారం శంకర్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నాయకులు తమను కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేదా పోయేదా అంటూ.. తీవ్రంగా హేళన చేశారని గుర్తుచేశారు. అలాంటిది కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అవహేళన చేసిన వారే కాంగ్రెస్‌లోకి చేరి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ స్కూల్‌ నుంచి వచ్చిన రంజిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో ఇతర పార్టీల నాయకులను ఎవరికి చెప్పకుండా చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీలో చేరాలనుకునే వారు పార్టీ కార్యాలయాలకు వచ్చి చేరాలి తప్ప, ఫామ్‌ హౌస్‌లోకి వెళ్లి రంజిత్‌ రెడ్డి గుట్టుచప్పుడు కాకుండా పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి భీంభరత్‌ ఓటమికి కృషి చేసిన నాయకులకే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం ప్రాధాన్యత ఇచ్చి, సీనియర్లను అనగదొక్కడం ఏంటని ప్రశ్నిం చారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ అసలైన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులకే సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి తీరు మార్చుకోవాలనీ, లేకపోతే సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి ఒంటెద్దు పొగడలు మానుకోవాలని హితవు పలికారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను చేర్చుకునే ముందు ఆయా గ్రామాలకు చెందిన సీనియర్‌ నాయకులకు చెప్పాలనే కనీస ధర్మాన్ని పాటించలేదని వారు మండిపడ్డారు. పార్టీలో అంద రినీ కలుపుకుని పోతేనే పార్టీ అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. రంజిత్‌ రెడ్డి శంకర్‌పల్లికి చెందిన కౌన్సిలర్‌ శ్రీనాథ్‌గౌడ్‌ మాటలను నమ్ముకుంటే పార్టీ భ్రష్టు పట్టిపోతుందని అన్నారు. ఇప్పటికైనా అందరినీ కలుపుకోవాలని పోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రంగారెడ్డి, నరసింహారెడ్డి, రాజిరెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, విష్ణుకాంత్‌ రెడ్డి ఉన్నారు.

Spread the love