భువనగిరి ఖిల్లాలో ఎర్రదండు

Red stick in Bhuvanagiri fort– సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజల్లోకి.. ఉద్యమ ఫలితాలతో..
– పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఎండీ జహంగీర్‌కు అన్ని వర్గాల మద్దతు

నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
విప్లవ పోరాటాలు, ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన భువనగిరి ఖిల్లాలో ఎర్రదండు కదం తొక్కుతోంది. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీ ప్రచారం సాగుతోంది. ఎర్రజెండా గెలుపు కోసం కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా సాధించిన ఫలితాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రజా సమస్యలపై నిర్థిష్టమైన ప్రణాళికలతో సీపీఐ(ఎం) ప్రచారం నిర్వహిస్తోంది. ప్రజల నుంచి పార్టీ అభ్యర్థి జహంగీర్‌కు అపూర్వ ఆదరణ లభిస్తోంది. మిగతా పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది.
భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కమ్యూనిస్టుల పోరాట చరిత్ర కలిగినవే. నాటి సాయుధ రైతాంగ పోరాటం మొదలు నేటి మూసీ ప్రక్షాళన ఉద్యమాల వరకు ఎన్నో ప్రజా ఉద్యమాలను నడిపిన ఘనత కమ్యూనిస్టులకు దక్కుతుంది. పార్లమెంట్‌ పరిధిలో భువనగిరి, ఆలేరు, జనగాం, తుంగతుర్తి, నకిరేకల్‌, మునుగోడు, ఇబ్రహీంపట్నం ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాలకు కంచుకోటలు. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు నాయకులు ప్రజా ప్రతినిధులుగానూ ప్రాతినిధ్యం వహించారు. భువనగిరిలో రావినారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, తుంగతుర్తిలో బీఎన్‌రెడ్డి, మల్లు స్వరాజ్యం, నకిరేకల్‌లో ధర్మభిక్షం, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, అత్యధిక కాలం నర్రా రాఘవరెడ్డి, ఆలేరులో ఆరుట్ల కమలాదేవి, జనగామలో ఏసీ రెడ్డి నర్సింహారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. వారు ప్రాతినిధ్యం వహించిన సమయంలో చేసిన అభివృద్ధి నేటికీ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, భూమి లేని వ్యవసాయ కూలీలకు భూ పంపిణీ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయాయి. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో కమ్యూనిస్టుల ప్రాబల్యంతో అత్యధికంగా పేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేశారు. ఇప్పటికీ ఆ కుటుంబాలు ఎర్రజెండా అభిమానులు గానే.. ఎర్రజెండాకు అండగా నిలబడుతున్నారు.
ప్రజా ఉద్యమాల ఫలితాలతో ప్రజల్లోకి..
గత ఉద్యమాల ఫలితాలను, సమస్యలను ప్రజలకు వివరిస్తూ సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రచారం సాగిస్తున్నారు. భవిష్యత్‌లో ప్రజల కోసం చేపట్టబోయే పోరాటాలను ప్రజలకు చెబుతూ వారి మద్దతును కూడగడుతున్నారు. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని అత్యధిక గ్రామాల నుంచి ప్రవహిస్తున్న ‘మూసీ’ ప్రక్షాళన కోసం ఇటీవల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి జహంగీర్‌ నేతృత్వంలో ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతుల నుంచి సీపీఐ(ఎం)కు మంచి ఆదరణ లభిస్తోంది.
కమ్యూనిస్టుల ఫలితమే.. సాగునీటి ప్రాజెక్టులు
భువనగిరి, నకిరేకల్‌ ప్రాంతాల్లో సాగు నీటి కోసం ఎన్నో ఏండ్లుగా సతమతమవుతున్న రైతుల పక్షాన సీపీఐ(ఎం) చేపట్టిన ఉద్యమాల ఫలితంగా ఈ ప్రాంతంలో రెండు సాగు నీటి అవసరాల కోసం ధర్మారెడ్డి పల్లి, పిల్లాయిపల్లి కాలువల ను ప్రభుత్వాలు ప్రారంభించాయి. దాంతో వేలాది మంది రైతులకు లబ్ది చేకూరుతున్నది. ఇలా అనేక ఉద్యమాల ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కరించిన చరిత్ర గల కమ్యూనిస్టులకు అవకాశం ఇస్తే ఉద్యమాలకు మద్దతు ఇచ్చిన వారవుతారని చెప్పడం ప్రజలను ఆలోచింప జేస్తోంది. ఈ ప్రాంత చరిత్రను మరొక్క సారి గుర్తు చేసుకుంటూ ఓటర్లు సీపీఐ(ఎం) అభ్యర్థిని ఆదరిస్తున్నారు. ఘనస్వాగతం పలుకుతున్నారు.

Spread the love