అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు

Relay fasts of Anganwadis– కొనసాగుతున్న సమ్మె
– వర్షంలోనే భారీ ర్యాలీలు
– ఆహార పంపిణీని అడ్డుకున్న వర్కర్లు
నవతెలంగాణ- విలేకరులు
సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు కోసం అంగన్‌వాడీల ఉద్యోగులు, ఆయాలు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా శుక్రవారం రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. వర్షంలోనూ భారీ ర్యాలీలు తీవారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని శివరాంపల్లి సెంటర్‌ వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఆహారం పంపిణీ చేయడానికి అధికారులు పోలీసుల సహాయంతో అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌, గండిపేట్‌ మండలాల అంగన్‌వాడీలు అక్కడికి చేరుకుని ఫుడ్‌ పంపిణీని అడ్డుకుని, సెంటర్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఫుడ్‌ పంపిణీని అధికారులు నిలిపివేయడంతో అంగన్‌వాడీలు ధర్నా విరమించారు. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల సమ్మెకు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు రఘునాథ్‌ యాదవ్‌ మద్దతు తెలిపారు. బాలాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్మికులు ధర్నా చేశారు.
వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండల కేంద్రంలో అంగన్‌వాడీలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహిపాల్‌ మద్దతు తెలిపారు. కొడంగల్‌లో అంగన్‌వాడీల సమ్మెకు టీఎస్‌యూటీఎఫ్‌ బొంరాస్‌పేట మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌ మద్దతు తెలిపారు.
అంగన్వాడీల సమ్మె డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించకపోతే సమాధి చేయడం ఖాయమని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్‌, ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్‌ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్‌ స్టాండ్‌ సమీపంలోని చిల్డ్రన్స్‌ పార్క్‌ వద్ద రెండ్రోజుల రిలే దీక్షలను ప్రారంభించారు. టేకులపల్లి, ఆళ్లపల్లి మండలాల్లో సమ్మె శిబిరాన్ని ఏజే.రమేష్‌ సందర్శించి మాట్లాడారు. ఇల్లందులో ప్రజాపంథా నాయకులు సంఘీభావం తెలిపారు. చర్లలో సీఐటీయూ నాయకులు సమ్మె శిబిరంలో కూర్చున్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌ అండ్‌బి గెస్ట్‌హౌస్‌ నుంచి భారీ ర్యాలీ తీశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్‌ కార్యాలయం ముందు రిలే దీక్షలను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు ప్రారంభించారు. బల్మూరు మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మెకు గర్భిణులు, బాలింతలు సంఘీభావం తెలిపారు. నారాయణపేట జిల్లాలో వర్షంలోనే అంగన్వాడీలు, సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా హాలియా మండలంలో సమ్మెలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఈసీఐఎల్‌ కేంద్రంలో సీఐటీయూ ఆఫీసు నుంచి ఈసీఐఎల్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. అంగన్‌వాడీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట అంగన్వాడీలు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ దీక్షను ప్రారంభించారు.

Spread the love