గృహలక్ష్మి మార్గదర్శకాలు విడుదల

– ఆహార భద్రతా కార్డున్నవారే అర్హులు
– సొంత జాగా ఉండాలి : జీవో జారీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జీవో ఎంఎస్‌ 25ను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయి జారీ చేసింది. మహిళల పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నది. లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్‌ ఎంపికచేసుకోవచ్చు. పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వంచే ఆమోదించబడిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయనుండగా, సంబంధిత కుటుంబం ఫుడ్‌ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలని సూచించింది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌ ఆధ్వర్యంలో పథకం అమలు చేయను న్నారు. రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలియజేసింది.
పేదలకు వరం : ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జీవో జారీ చేసిన నేపథ్యంలో మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరమని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమనీ, సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూ డు వేల ఇండ్లు కేటాయించ నున్నట్టు చెప్పారు. మొత్తం నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూ రుతుందని వివరించా రు.సీఎం కేసీఆర్‌కు హృద యపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. పేదల సొంతింటి కల నెరవేర్చడం సీఎం కేసీఆర్‌ ఆశయమనీ, గృహలక్ష్మి పథకం పేదలకు అందిస్తున్న వరమని చెప్పారు. ఇదిలా వుండగా, సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారికోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో నాలుగు లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని మార్చి తొమ్మిదిన జరిగిన క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నది.మొత్త నాలుగు లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించను ండగా, మరో 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో అనుమతి ఇవ్వనున్నారు. పథకం కింద లబ్ధిదారుల కు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దఫాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి రూ.12 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులను సైతం కేటాయించింది. పథకాన్ని జులై నుంచి అమలు చేయాలని అధికారులను సర్కారు ఆదేశించిన విషయం తెలిసిందే.

Spread the love