నవతెలంగాణ – రెంజాల్
ఆరుగాలము కష్టించి పండించిన రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడంలో మండల కేంద్రమైన రెంజల్ సింగిల్ విండో ద్వారా అధిక సంఖ్యలో ధాన్యం సేకరించినట్లు సింగిల్ విండో చైర్మన్ మొహీనుద్దీన్, సీఈవో వై .రాము, లు పేర్కొన్నారు. ఇటీవల ప్రైవేటు వ్యాపారస్తులు 22 వేలకు కొనుగోలు చేయడంతో రైతులు ఆసక్తి చూపారని, దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల లో ఇవ్వడానికి నిరాశక్తత చూపడంతో బీహార్ నుంచి తీసుకువచ్చిన హమాలీలకు రోజుకు రూ.2000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. గత వారం రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తుండడంతో వ్యాపారులు ధాన్యం కొనుగోలుకు వెనుకంజ వేయడంతో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు రెంజల్ సింగిల్ విండో ద్వారా సుమారు 50 వేల బస్తాలను సేకరించగా, దూపల్లి సొసైటీ 30,300, నీలా సొసైటీ 9000, ఆగ్రోస్ ద్వారా 19.296 బస్తాలు, సేకరించగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నత్తనడకగా కొనుగోలు జరిగాయి. కొన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి పరిమితమయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో రైతులు పండించిన ధాన్యం పూర్తి అవుతుందని వారు పేర్కొన్నారు.