గాజాలో ఆరోగ్య వ్యవస్థను పునరుద్ధరించండి

Restore the health system in Gaza– అంతర్జాతీయ సమాజాన్ని కోరిన పాలస్తీనా
గాజా: గత 24గంటల్లో మరణించిన 756మంది పాలస్తీనియన్లతో సహా గాజాలో 6,546మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో 2,704మంది పిల్లలు వున్నారు. ఇప్పటివరకు 17వేల మందికిపైగా గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయిల్‌ నిరంతరంగా కొనసాగిస్తున్న బాంబు దాడులు, వైద్య సరఫరాలు, సిబ్బంది కొరత కారణంగా మొత్తంగా గాజాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. తక్షణమే ఈ వ్యవస్థ పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాల్సిందిగా ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈ పరిస్థితులపై తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రపంచ దేశాలు పట్టించుకోవడం లేదని అన్నారు. గాజాలో 30శాతానికి పైగా ఆస్పత్రులు మూత పడ్డాయని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో మూడింట రెండు వంతులు మూతపడ్డాయని తెలిపింది. బాంబు దాడులతో ధ్వంసం కావడం, ఇంధన కొరత కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో గాజా పొరుగు ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడ జీవన పరిస్థితులన్నీ అస్తవ్యస్థంగా మారాయి. గాజాలో పాలస్తీనా జర్నలిస్టు సయీద్‌ అల్‌ హలాబి బుధవారం ఉత్తర గాజాలో జరిగిన బాంబు దాడిలో మరణించారు. ఇప్పటివరకు 21మంది పాలస్తీనా జర్నలిస్టులు మృతి చెందగా, ముగ్గురు ఇజ్రాయిల్‌, ఒక లెబనాన్‌ జర్నలిస్టు కూడా చనిపోయారు. గాజాలో ఇజ్రాయిల్‌ సాగించే యుద్ధంలో ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం వద్దని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి తన మిలటరీని హెచ్చరించారు. ఆ దిశగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. సంక్షోభ సమయాల్లో హేతు బద్ధంగా, సంయమనంతో వ్యవహరించే చరిత్ర ఈజిప్ట్‌ ఆర్మీకి వుందని అన్నారు.

Spread the love