సలీం సాబ్‌ రిటైర్‌మెంట్‌

సలీం సాబ్‌ రిటైర్‌మెంట్‌– గాంధీ మార్చురీతో 32 ఏండ్ల అనుబంధం
–  60 వేలకుపైగా శవపరీక్షల్లో ఆయన పాత్ర : రిటైర్‌మెంట్‌ సభలో పాల్గొన్న గాంధీ సూపరింటెండెంట్‌ ఎం. రాజారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గాంధీ ఆస్పత్రిలో ఓ మూలన పడి ఉండే మార్చురీ అంటేనే అందరికీ భయం…అటువైపు వెళ్లేందుకు మరణించిన వారి బంధువులు సైతం జంకేంత భయానకం…ఓ పక్క కుళ్లిన మృతదేహాల నుంచి వెలువడే దుర్గంధం..మరోపక్క శవాలతో సహవాసం..అలాంటి చోట మహ్మద్‌ సలీం అనే ఉద్యోగి 32 ఏండ్ల సుధీర్ఘ కాలం పాటు తన సేవలు అందించి అందరి మనన్నలు పొందారు. ఆయన 42 ఏండ్ల ఉద్యోగ కాలంలో 32 ఏండ్ల ప్రస్థానం మార్చురీలోనే కొనసాగింది. 60 వేలకుపైగా శవపరీక్షల్లో ఆయన డాక్టర్లతో పాలుపంచుకున్నాడు. చిక్కుముడిగా మారిన మరణాలకు సంబంధించిన ఎన్నో కేసుల పరిష్కారంలో తన వంతు సహకారాన్ని పోలీసులకు పోస్టుమార్టం రిపోర్టుల ద్వారా అందించాడు. అంతకాలం సేవలందించిన ఆయన శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగ విరమణ పొందారు. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రి మార్చురీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలనీ శాఖ అధిపతి డాక్టర్‌ కృపాల్‌ సింగ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో సలీం ఉద్యోగ విరమణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజారావుతోపాటు మార్చురీలో పనిచేస్తున్న ప్రస్తుత సిబ్బంది, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న గాంధీ పూర్వ విద్యార్థులు మహ్మద్‌ సలీమ్‌ను ఘనంగా సన్మానించారు. రాజారావు మాట్లాడుతూ..వైద్య విద్యార్థులకే కాకుండా ట్రైనీ ఐపీఎస్‌లకు, జ్యూడీషియల్‌ స్టాఫ్‌కు శవపరీక్షపై అవగాహన కల్పించేవారని గుర్తుచేశారు. సలీం విరమణ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదన్నారు. ఆయన ఎంతో నిబద్ధతతో సేవలు అందించేవారని కొనియాడారు. తాము వైద్య విద్య అభ్యసించే సమయంలో అనేకాంశాల్లో సలీం సహాయపడేవాడనీ, తన సుధీర్ఘ అనుభవంతో శవపరీక్ష సమయంలో మరణానికి గల కారణాలను అనేక కోణాల్లో విడమర్చి చెప్పేవారని గాంధీ పూర్వ విద్యార్థులు గుర్తుచేసుకున్నారు.

Spread the love