రేవంత్‌ అడ్డగోలు మాటలపై చర్యలేవి..?

Actions on Revanth Addagolu's words..?– నా ప్రచారాన్ని 48 గంటలు నిషేధిస్తే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తరు
–  ఇదంతా బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర
– మోడీవి కల్లబొల్లి కబుర్లు
– మానుకోట జిల్లా రద్దుకు రేవంత్‌ కుట్ర : మానుకోటలో రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-మహబూబాబాద్‌
”ఎన్నికల కమిషన్‌ నా మీద నిషేధం విధించింది. 48గంటల పాటు కేసీఆర్‌ ప్రచారం చేయొద్దని ఆదేశించింది. అయితే, రేవంత్‌ రెడ్డి.. కూడా నా పేగులు మెడలో వేసుకుంటా.. నీ గుడ్లు పీకుతా.. అని అడ్డగోలు మాటలు మాట్లాడారు. మరి ఆయనపై ఎందుకు నిషేధం పెట్టలేదు. నా మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేదు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం కరెక్టు కాదు. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే దాదాపు 96 గంటలు లక్షలాది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేస్తారు.” అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇదంతా కాంగ్రెస్‌, బీజేపీ పన్నిన కుట్ర అని తెలిపారు. బుధవారం మహబూబాబాద్‌లో ఎంపీ అభ్యర్థి మాలోతు కవితకు మద్దతుగా నిర్వహించిన రోడ్డు షోలో కేసీఆర్‌ మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ నీళ్లు, నిధులు దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మానుకోట జిల్లా రద్దు చేస్తానంటున్నారని, కాబట్టి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో నల్లధనాన్ని బయటకుతీసి పేద ప్రజల ఒక్కొక్క ఎకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి ఒక్క పైసా వేయలేదన్నారు. కృష్ణా జలాలను కేంద్రం పరిధిలోకి తీసుకున్నారని, రాబోయే రోజుల్లో గోదావరి నీళ్లనూ తీసుకుపోవడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మారుమూల గిరిజన ప్రాంతమైన మానుకోట అభివృద్ధి చెందాలని తాను మానుకోట జిల్లాను ఏర్పాటు చేయగా సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లా రద్దు చేస్తానని అంటున్నారని, కవితని గెలిపిస్తేనే మీ జిల్లా మీకు ఉంటుందని లేకుంటే పోతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో ఏ ఒక్కరోజూ సాగునీరు రాలేదని, కరెంటు సక్రమంగా లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే వెన్నవరం కాలువలో నీళ్లు వచ్చాయని, ఎస్సారెస్వీ కాలువలు నిర్మాణం పూర్తి చేసి నీళ్లు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఈ మూడు నెలల్లో ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చింది లేదని అన్నారు. కేసీఆర్‌ కాలంనాటి 24 గంటలు విద్యుత్‌ ఏమైందని, మిషన్‌ భగీరథ పథకం ఏమైందని ప్రశ్నించారు. మళ్లీ రైతులు బోరుబావిలో పైసలు పోసుకుని అప్పుల పాలవుతూ ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ నీళ్లు, నిధులు రక్షించబడాలంటే బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ బస్సు యాత్రలో అభ్యర్థి మాలోతు కవిత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్‌, శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love