తుమ్మలతో రేవంత్‌ భేటీ

– కాంగ్రెస్‌లోకి ఆహ్వానం
– 6న చేరే అవకాశం!
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న తమ్మలపై పార్టీ మారాలని అభిమానుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ నాయకులు మల్లు రవి తదితరులు వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా తుమ్మలను ఆహ్వానించారు. ఈ మేరకు అయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈనెల 6వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం.
గండుగులపల్లి నుంచి హుటాహుటిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని స్వగృహంలో అభిమానులు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన టీపీసీసీ నేతలు తనను కలిసేందుకు వస్తున్నామని తెలపడంతో హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. తుమ్మల ఇంట్లో సుమారు 40 నిమిషాల పాటు టీపీసీసీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల కొన్ని అభ్యర్థనలను వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది. తుమ్మల వెంట అయన ప్రధాన అనుచరుడు సాధు రమేష్‌ రెడ్డి ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తుమ్మల ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగయ్యాక ఈనెల 25వ తేదీన ఖమ్మం వచ్చారు.
ఈ సందర్భంగా వేలాది కార్లు, బైక్‌లతో అభిమానులు భారీ ర్యాలీతో ఆహ్వానం పలికారు. జై తుమ్మల… జై కాంగ్రెస్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మల ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతానని ప్రతినబూనారు.
ఆ మూడు స్థానాల్లో ఎక్కడి నుంచి..?
తుమ్మల తాను పాలేరు నుంచి పోటీ చేసి తీరుతానని అంటుండగా కాంగ్రెస్‌ నుంచి ఈ స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. గురువారం ఢిల్లీలో రాహుల్‌, సోనియా గాంధీలతో భేటీ అయిన వైఎస్‌ఆర్‌ టీపీ అధినేత వైఎస్‌ షర్మిల సైతం పాలేరు నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కందాల ఉపేందర్‌ రెడ్డి పేరు ఖరారవడంతో సామాజిక సమీకరణాల దృష్ట్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లేదంటే షర్మిలను బరిలో నిలపాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తుమ్మలను ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే ఎక్కువగా ఉపయోగం ఉంటుందని, ఈ స్థానం నుంచి మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉండటంతో సామాజిక సమీకరణాల కోణంలో మేలు జరగవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇవి రెండూ వీలుకాని పక్షంలో తుమ్మలను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం.

Spread the love