తెలంగాణ ప్రజల ఆశలను కేసీఆర్‌ కాలరాశారు: రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్‌ కాలరాశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, మల్లు రవి తదితరులు పొంగులేటి, అతని మిత్రబృందం కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ దిశగా పలువురు నేతలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. పొంగులేటితో పాటు ఇతర నేతల చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్నారు.‘‘తెలంగాణ ఏర్పాటుకు ప్రొ.జయశంకర్‌ పరితపించారు. తెలంగాణ జాతిపితగా జయశంకర్‌ను 4 కోట్ల మంది గౌరవించుకున్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన క్రియాశీలపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా పేరుగాంచారు. కానీ, ఆయన ఆశించిన ఫలితాలు రాలేదు. కేసీఆర్‌ కుటుంబం కోసం తెలంగాణ వనరులను కబ్జా చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఇతరులకు ప్రయోజనం చేకూరలేదు. రాజకీయ ప్రయోగశాలలో తెలంగాణను వేదికగా మార్చారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తాం. త్వరలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో సమావేశమవుతాం. ఖమ్మంలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Spread the love