రైట్‌…రైట్‌…

Right... Right...– టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గ్రీన్‌ సిగల్‌
– బిల్లుపై సంతకం చేసిన గవర్నర్‌
– ఆమోదించిన ఉభయసభలు
– వాళ్లూ మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌
– ఆర్టీసీ ఉంటుంది : రవాణామంత్రి పువ్వాడ అజరుకుమార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం-గవర్నర్‌కు మధ్య జరిగిన అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఆదివారం గవర్నర్‌ ఈ బిల్లుపై సంతకం చేశారు. శాసనసభ, శాసనమండలి ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. బిల్లులోని ప్రధాన అంశాలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ సభకు వివరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కూడా ఈ బిల్లుపై మాట్లాడారు. అంతకుముందు గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ రవాణాశాఖ ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించి, మరికొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి గవర్నర్‌కు బిల్లుపై ఉన్న సందేహాలను తీర్చారు. అనంతరం వారిముందే ఆమె బిల్లుపై సంతకం చేసి ఇచ్చారు. దాన్ని తీసుకొని వారు నేరుగా అసెంబ్లీకి వచ్చి, రవాణాశాఖ మంత్రితో చర్చించారు. శాసనసభ మరికొంచెం సేపట్లో ముగుస్తుందనగా ఈ అంశంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్‌ తెలిసీ తెలియక వివాదం కొనితెచ్చుకున్నారని అన్నారు. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్తున్నదని చెప్పారు. సంస్థను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశామనీ, డైనమిక్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, సీనియర్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్‌ను చైర్మెన్‌గా నియమించామన్నారు. ఆర్టీసీ రోజుకు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతుందనీ, దీనికోసం రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ అవసరమని వివరించారు. లీటర్‌కు రూ.45 కు పైగా రేటు పెరగడంతో రోజుకు రూ.2.5 కోట్లు నష్టం వస్తున్నదని తెలిపారు. ఆర్టీసీ స్థితిగతులపై మంత్రివర్గ సమావేశంలో నాలుగు గంటలకు పైగా చర్చించామన్నారు. ప్రజారవాణా ప్రభుత్వాల సామాజిక బాధ్యత అనీ, దాన్ని తాము విస్మరించలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఏటా రూ.1,500 కోట్లు బడ్జెట్‌లో పెట్టి ఇచ్చి సాకినా, కోలుకునే పరిస్థితి లేకపోయిందని చెప్పారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు పలు చిక్కులు పోతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వద్దన్నోళ్లే ఇప్పుడు ఎలా తీసుకుంటారని కొందరు మాట్లాడుతున్నారనీ, వాళ్లను పట్టించుకోబోమన్నారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని దుర్మార్గంగా మాట్లాడుతుంటే బాధేస్తుందన్నారు. ప్రజలకు ఆర్టీసీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తే సహజంగానే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు, అలవెన్సులు పెరుగుతాయని వివరించారు. గవర్నర్‌ పనిలేని పనులు ఎందుకు పెట్టుకున్నారో తెలీదనీ, మొత్తానికి జ్ఞానోదయం అయ్యి సంతకం చేశారని చెప్పారు. ఊరికే క్లారిఫికేషన్స్‌ అడిగారనీ, ఏదేమైనా గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్తున్నామని అన్నారు.
ఉద్యోగులు మాత్రమే విలీనం
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే విలీనం అవుతున్నారనీ, టీఎస్‌ఆర్టీసీ సంస్థ అలాగే ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆర్టీసీని 9వ షెడ్యూల్‌లో చేర్చారనీ, ఆస్తుల పంపకం సహా పలు అంశాలపై విభజన ప్రక్రియ పూర్తికాలేదన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, జీతభత్యాలను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ప్రత్యేక చట్టం రూపొందిన తర్వాత ఐఏఎస్‌ అధికారి వైస్‌ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా ఉంటారని వివరించారు. అప్పటి వరకు ఇప్పుడున్న సర్వీసు రూల్స్‌ కొనసాగుతాయని తెలిపారు. ఆస్తులన్నీ కార్పొరేషన్‌ పరిధిలోనే ఉంటాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఏటా రూ.3వేల కోట్ల ఆర్థికభారం పడుతుందని చెప్పారు. సంస్థలోని 43,035 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, 245 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఈ విలీనం ద్వారా లబ్దిపొందుతారని అన్నారు. ఆర్టీసీ సంస్థ ఉంటుంది కాబట్టి సీసీఎస్‌ బకాయిలను చెల్లిస్తుందనీ, పీఆర్సీ, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అన్నీ నిబంధనల ప్రకారం పరిష్కరింపబడతాయని తెలిపారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌పై ఉద్యోగులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సంస్థలో పనిచేస్తున్న డైలీవేజ్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు యథావిధిగా కొనసాగుతారని చెప్పారు.
ధన్యవాదాలు-బాజిరెడ్డి గోవర్థన్‌
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని ఆ సంస్థ చైర్మెన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ అన్నారు. శాసనసభలో ఈ బిల్లుపై ఆయన మాట్లాడారు. అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నా, సంస్థను గాడిలో పెట్టలేకపోయామన్నారు. దీనికి డీజిల్‌ ధరల పెంపే ప్రధాన కారణమని చెప్పారు. నెలకు రూ.471 కోట్ల ఆదాయం వస్తే, ఖర్చు రూ.597 కోట్లుగా ఉందన్నారు. ప్రతినెలా నష్టం రూ.125 కోట్లు వస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

Spread the love