బడి బాటకు వేలయే.!

– రేపటి నుంచి 19 వరకు కార్యక్రమం
– ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంపే లక్ష్యం
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేర్పడుతొంది. ఇందులో భాగంగానే ఏటా మాదిరిగానే ఈసారి కూడా పాఠశాలలు పున. ప్రారంభానికి ముందుగా బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 3 నుంచి 19 వరకు కార్యక్రమాన్నీ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. చిన్నారులను ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో 1వ తరగతిలో, 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను 6వ తరగతిలో చేర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంగన్ వాడిల్లో ఉన్న పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే నెల రోజులుగా ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలల వారు గ్రామాల్లో, పల్లెల్లో ఇంటింటా తిరుగుతూ తమ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఒప్పిస్తూ అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. ఇక సర్కారు బడుల్లో మౌలిక వసతులతోపాటు, ఉపాధ్యాయుల కొరత ప్రధాన సమస్యగా మారింది.
ప్రయివేటు వైపే మొగ్గు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత,మౌలిక వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లోనే చేర్పించినట్లుగా తెలుస్తోంది.రెండేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాల్లో  ఆంగ్లామద్యమం ప్రవేశపెట్టినప్పటికి ఆశించిన ఫలితాలు కానరావడం లేదు.మండలంలో 380 మంది 1వ తరగతిలో చేరాల్సి ఉంది.అయితే ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతారో చూడాల్సిందే.6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు మండలంలో 250 ఉన్నారు.వీరిలో ఎంతమంది చేరుతారనేది తెలియాల్సి ఉంది.
ఖాళీలతో సతమతం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మండలంలో మొత్తం 96 పోస్టులు ఉండగా 70 మందిలోపే ఉన్నట్టుగా తెలుస్తోంది.సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు, విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేరు. విద్యార్థులు లేనిచోట ప్రతియేటా ఒక పాఠశాల మూత పడుతున్న పరిస్థితి. మండలంలో ఇప్పటికే గట్టుపల్లి,లంబడి పల్లి,వెల్మలపల్లి,కేశారం పల్లి,జిమ్ పల్లి తదితర ఐదు ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. ఉపాధ్యాయులు లేనిచోట సర్దుబాటు చేసిన వారు విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి.
మౌలిక వసతులు లేకపోవడంతోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపోవడంతోనే విద్యార్థుల సంఖ్య పెరగడం లేదని తెలుస్తోంది.అయితే గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టిన పూర్తిస్థాయిలో అమలు కాలేదు.కొన్ని పాఠశాలల్లో మాత్రమే అసంతృప్తిగా పనులు జరిగాయి.కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత మహిళ సంఘాల ద్వారా  అమ్మ ఆదర్శ కమిటీల పేరిట పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం  పనులు కొనసాగుతున్నాయి. బడులు ప్రారంభించే లోగా పూర్తిస్థాయిలో పూర్తియ్యేలా కానరావడం లేదు.తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం, ఇతర మౌలిక వసతులు లేని కారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలకు పంపేందుకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.
Spread the love