– తరుగు పేరుతో అడ్డుగోలు కోత పెడుతున్నారని ఆగ్రహం
– తూకం వేసినా లారీలు పంపరా..
– వెంటనే ధాన్యం తరలించాలని డిమాండ్
నవతెలంగాణ-బోయినిపల్లి/ చందుర్తి / జుక్కల్
తేమ, తాలు పేరుతో ఇష్టారీతిన కోత పెడుతున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేశారు. ఇసుకను తరలించేందుకు ఉన్న లారీలు ధాన్యాన్ని తీసుకెళ్లడానికి ఎందుకు ఉండవని ప్రశ్నించారు.
సిరిసిల్ల జిల్లాలోని బోయిని పల్లి మండలం బురుగుపల్లి గ్రామంలో తరుగు పేరుతో తూకం లో అడ్డగోలుగా కోతపెడుతున్నారని ధర్నా రైతులు చేపట్టారు. వారికి మద్దతుగా సీపీఐ (ఎం) మండల కన్వీనర్ గురుజాల శ్రీధర్ మాట్లా డుతూ.. తాలు, తేమ వంటి కారణాలు చూపి బస్తా కు నాలుగైదు కిలోలు కోతపెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నగేష్, చంద్రయ్యా, కిష్టయ్యా, రామ లింగయ్యా, మల్లేశం, సత్తాయ్యా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తూకం వేసిన వరి ధాన్యాన్ని తరలించడం లేదని చందుర్తి మండలం మూడపల్లి గ్రామ రైతులు వేములవాడ-కోరుట్ల రహదారిపై బైటాయించారు. రహదారిపై ధాన్యం బస్తాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ఘటనా స్థలానికి వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో రైతులకు సర్పంచ్ అంజిబాబు, కిసాన్ సెల్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మద్దతు తెలిపారు.
ధాన్యం తరలించేందుకు లారీలు ఉండవా..?
ఇసుక తరలించేందుకు లారీలుంటున్నాయని, కానీ ధాన్యం తరలించేందుకు ఉండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు లేవనే కారణంతో కొనుగోలు కేంద్రాలు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో 161వ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. లారీలు లేవనే సాకుతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసేశారని తెలిపారు. ఇసుక తరలించేందుకు లారీలు నడుస్తున్నా యని, ధాన్యం తరలించేందుకు మాత్రం లారీలు లేవంటు న్నారని వాపోయారు.
ఆ లారీలన్ని రాజకీయ నాయకులవే కావడంతో రెవెన్యూ, పోలీస్ శాఖ వారు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుపై వాహనాల టైర్లు వేసి మంటపెట్టి నిరసన చేపట్టారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహ నాలు బారులు తీరాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.