– 2032-33 నాటికి మనపైబడే భారం ఇది
– 2.02 లక్షల మంది అనర్హులకు ఆసరా పింఛన్లు
– రూ.1,175 కోట్ల అక్రమ చెల్లింపులు
– డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంతో రూ. 4 వేల కోట్ల నష్టం
– ఇసుక తవ్వకాల్లో భారీగా అవకతవకలు
– గొర్రెల పంపిణి పథకంలోనూ అనుమానిత మోసాలు
– దస్తావేజుల విలువ తగ్గించి రిజిస్ట్రేషన్లు
– గత ప్రభుత్వానికి కాగ్ వాతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళన కరంగా ఉందని గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో పేర్కొంది. ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా ఇష్టారీతిన అప్పులు చేయడం వల్ల భవిష్యత్‌లో రాష్ట్రంపై పెను ప్రభావం పడనుందని వెల్లడించింది. రూ.1.18 లక్షల కోట్ల బడ్జెట్ వెలుపలి అప్పులను వార్షిక పద్దుల్లో చూపించలేదని కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుల వడ్డీల కోసం తిరిగి అప్పులు చేయడం వల్ల అవి మోయలేని భారంగా మారాయని తెలిపింది. అప్పుల ద్వారానే లోటును భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది. ఇప్పటివరకు తీసుకున్న రుణాలకుగాను 2032-33 వరకు రూ.2.52 లక్షల కోట్లు వడ్డీల కోసం చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ భారం దీర్ఘ కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆసరా పించన్ల పంపిణీలోనూ అనేక అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక వెల్లడించింది. 2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లను పంపిణి చేశారు. అసరా, సమగ్ర కుటుంబ సర్వేల మధ్య 16 శాతం వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దరఖాస్తుల పరిశీలన, ఆమోదానికి సంబంధించి సరైన విధానాన్ని పాటించలేదు. వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు పింఛన్లలో రూ.535 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయని కాగ్ ఈ సందర్భంగా తేల్చింది. మృతి చెందిన 367 మంది పేర్లను జాబితా నుంచి తొలగించ కుండా అనేక నెలల పాటు పించన్లు అందించారు. భూస్వాములు, కార్లు ఉన్నవారికి కూడా చెల్లింపులు చేశారు. మొత్తంగా చూస్తే 2.02 లక్షల మందికి రూ.1,175 కోట్ల మేర అక్రమంగా చెల్లింపులు చేశారని పేర్కొంది.
డబుల్‌లో నిధుల దారి మళ్లింపు
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం నిధులను దారి మళ్లించిందని, ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వహణలోనే లోపం ఉందని స్పష్టం చేసింది. పట్టణ, గ్రామీణ పేదవారికి గౌరవప్రదమైన ఇండ్లను అందించేందుకు 100 శాతం రాయితీతో కూడిన రెండు పడకల గదుల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. అయితే ఈ పథకంలో లోటుపాట్లు ఉన్నాయని కాగ్ నివేదిక వెల్లడించింది. తీసుకున్న రుణ మొత్తాన్ని కొంత కాలం పాటు నిరర్థకంగా డిపాజిట్లలో ఉంచడంతోపాటు, నిధులను ఇతర పథకాలకు, సంస్థలకు దారి మళ్లించినట్లు తెలిపింది. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి సంబంధం లేని ఇతర రుణాలను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆక్షేపించింది. జీహెచ్‌ఎంసీ పరిదిలో నిర్మించిన ఇండ్ల వల్ల రూ.4 వేల కోట్ల నష్టం జరిగినట్టు తేల్చింది. మంజూరు చేసిన లక్ష ఇండ్లకు గాను 48,178 ఇండ్లు పూర్తయ్యాయి. పథకం కోసం లబ్దిదారులను గుర్తించకపోవడంతో, పూర్తయిన ఇండ్లల్లో 96 శాతం (46,442) ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందనీ, నిర్మాణం పూర్తయిన ఇండ్లు ఖాళీగా ఉంచడం వల్ల ఇప్పటి వరకు ఖర్చుచేసిన రూ.3,983.68 కోట్లు వథా అయ్యాయని తెలిపింది. ఈ రకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందించే లక్ష్యం నెరవేరలేదని కాగ్ తన రిపోర్ట్ లో పేర్కొంది.
ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు
ఇసుక తవ్వకాలపై కూడా కాగ్ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారనీ, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారని పేర్కొంది. సర్కార్ ఇసుక అక్రమాలను అడ్డుకోలేక పోయిందని తెలిపింది. ఇసుక తవ్వకాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేవన్నారు. అధిక లోడ్‌లు వేసి ప్రజాధనానికి నష్టం చేశారని కాగ్ పేర్కొంది. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ లేదని వెల్లడించింది. అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగిందన్నారు. పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవని కాగ్ తెలిపింది.
గొర్రెల పంపిణి సక్రమంగా జరగలేదు
గొర్రెల పంపిణీ పథకం సక్రమంగా అమలు జరగలేదని కాగ్ తెలిపింది. కింది స్థాయి నుంచి పై వరకు అనేక అనుమానిత మోసాలు జరిగాయని వివరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో తనిఖీ చేయగా రూ. 253.93 కోట్ల మేర అక్రమాలు జరిగాయిని గుర్తించింది. కొన్నవాటినే తిరిగి కొనడం, నకిలీ ఇన్‌వాయిస్ సృష్టించడం లాంటి చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది.
రిజిస్ట్రేషన్లలో అక్రమాలు
రిజిస్ట్రేషన్ శాఖ తీరును కాగ్ తప్పు పట్టింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్లలో అనేక అవకతవకలు జరిగాయని తేల్చింది. కార్డ్ సెంట్రల్ ఆర్కిటెక్చర్ (సీసీఏ) అనే డిజిటల్ విధానం తీసకొచ్చినప్పటికి అనేక లోపాలుండటం వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. మార్కెట్ విలువను తగ్గించి ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేశారని వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 దస్తావేజులను పరిశీలించగా 375 దస్తావేజుల్లో రూ.3.44 కోట్ల మేర తక్కువ లెక్కలు కట్టినట్టు తేల్చింది. ఒకే కంపెనీ తమ ఆస్తులను తనఖా పెట్టి ఒకటి కంటె ఎక్కువ అర్థిక సంస్థలనుంచి రుణాలు తీసుకున్నారు. ఒక సంస్థ తీసుకున్న రుణం రూ.673.46 కోట్లపై 0.5 శాతం కాకుండా ఒక్కొక్క దానిపై రూ.10,000 ఫీజును మాత్రమే వసూలు చేసినట్టు గుర్తించారు. దీని వల్ల మూడు కేసుల్లో రూ.3.36 కోట్లు తక్కువగా ఫీజు వసూలైనట్టు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చేసిన తనిఖీల్లో 28 దస్తావేజుల్లో రూ.1.46 కోట్ల తక్కువ సుంకం విధించినట్టు గుర్తించారు. ఇలాంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
స్థానిక సంస్థలకు అన్యాయం
రాష్ట్రంలో ఒక్క జిల్లాలో కూడా ప్రణాళికా సంఘాలుఏర్పాటు కాలేదని, స్థానిక అవసరాలు, ఉమ్మడి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడంలో విఫలమైందంటూ గత సర్కార్ విధానాలను తప్పు పట్టింది. రాజ్యాంగ సవరణ ప్రకారం పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు విధులు బదిలీని ఉదహరించినప్పటికీ చాలా వరకు విధులను ప్రభుత్వం వివిధ శాఖలు, అనుబంధ సంస్థల ద్వారానే నిర్వహిస్తుందని తప్పు పట్టింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను ఇవ్వడం లేదని గత ప్రభుత్వ విధానాలను కాగ్ ఎత్తి చూపించింది. 2017 నుంచి 2020 వరకు ఆయా సంస్థలకు నిధుల విడుదల 50 శాతం తగ్గిపోయిందని, దీంతో పట్టణ ప్రాంత ఆర్థిక స్థితి ఆధ్వాన్నమైనట్టు గుర్తించింది.
అంతకు ముందు 14వ ఆర్థిక సంఘం గ్రాంట్లు కూడా రూ. 647 కోట్లు తగ్గాయనీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆస్తుల బదిలీపై వసూలు చేసిన స్టాంపు డ్యూటీ సర్ చార్జ్ మొత్తం రూ.1,822 కోట్లు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేయలేదని వెల్లడించింది. విద్యావైద్యంలో వెనక బడ్డామని 2022 మార్చి నాటికి ఆర్థిక పరిస్థితులను కాగ్ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ రాబడి ఎక్కువగా చూపి, రెవెన్యూ లోటును తక్కువ చూపించారనీ, ప్రధానంగా విద్య, వైద్యం మీద అతి తక్కువ ఖర్చు చేశారని కాగ్ తప్పు పట్టింది. మొత్తం వ్యయంలో విద్య మీద కేవలం 8 శాతం, ఆరోగ్యం మీద 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని నివేదికల్లో పేర్కొన్నారు.