– అధికారుల బాధ్యతా రాహిత్యం..కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం !
– మేడారం నాటికి అందుబాటులోకొచ్చేనా?
– వాజేడు-వెంకటాపురం రహదారి పనుల్లో నాణ్యతా లోపం..
నవతెలంగాణ-వెంకటాపురం
ములుగు జిల్లా వాజేడు మండలం వై జంక్షన్ నుంచి వెంకటాపురం మండలం ఎదిర వరకు రూ.44 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నారు. ఇంజినీరింగ్ అధికారుల బాధ్యతా రాహిత్యం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంతో పనుల్లో నాణ్యత లోపించి నట్టు ఆరోపణలొస్తున్నాయి. గత బీఆర్‌ఎస్ పాలనలో రోడ్డు పనులు దక్కించుకున్న వరంగల్‌కు చెందిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతి నిది రోడ్డు పనులు ప్రారంభించినప్పటి నుంచి పనుల్లో నాణ్యత చేపట్టట్లేదని విమర్శలొస్తున్నాయి. అసంపూర్తి పనులతో వెంకటా పురం-వాజేడు మండలాల్లో ప్రధాన రహదారిపై గుంతలు, కంకరతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. భద్రాచలం-చండ్రుపట్ల ఆర్‌అండ్‌బీ రహదారి రెండు మండలాల పరిధిలో 65 కి.మీ నుంచి 113 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇసుక క్వారీల నిర్వాహణ, అధిక లోడు వాహనాల రాకపోకలతో రోడ్డు ధ్వంసమైంది. రహదారి మరమ్మతులకు సంబంధిత శాఖ రూ.23.80 కోట్ల అంచనాను రూపొందించింది. ఐదు బిట్లుగా విభజించిన ఈ రహదారి పనులను వరంగల్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. పనుల్లో జాప్యం, గోదావరి వరదలతో ఈ మార్గం పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో ఆ శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి దాదాపు 46 కి.మీ మార్గాన్ని పూర్తి స్థాయిలో ఆధునికీకరించేందుకు రూ.44 కోట్లకు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. ఈ పనులను సైతం అదే గుత్తేదారుతో చేయించేందుకు ప్రణాళిక చేపట్టినా ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జగన్నాధపురం వై జంక్షన్ నుంచి వెంకటాపురం, చొక్కాల నుంచి పాత్రాపురం శివారు వరకు దాదాపు 18 కి.మీ పనులు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్ అధికారి పర్యవేక్షణ లేకపోవడం, గ్యాంగ్‌మెన్‌ల ఆధ్వర్యంలో పనులు కొనసాగడంతో గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేసినట్టు తెలుస్తోంది. దాంతో కొత్తగా వేసిన రోడ్డు పాడై దాని కింద ఉన్న పాత రోడ్డు దర్శనమిస్తోంది. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఓవర్ లోడ్ వాహనాల రాకపోకలను అధికారులు సాకుగా చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు పాత్రాపురం నుంచి ఎదిర గుట్టల వరకు 28 కి.మీ మేర మార్గంలో అనేక చోట్ల తారు తొలగించి కంకర పరిచి వదిలేశారు. దాంతో పెద్ద మొత్తంలో దుమ్ము లేస్తూ వాహనాదారులను ఇబ్బందుకుల గురిచేస్తోంది.
జాతరలోపు పూర్తయ్యేనా..?
మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీ వరకు సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరగనున్న నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల సందర్శకులు ఈ రహదారినే ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోడ్డంతా అసంపూర్తి పనులతో గుంతలు ఉండటంతో ప్రయాణం ఆలస్యం అవుతోంది. జాతర ప్రారంభం నాటికి ఈ మార్గాన్ని పూర్తి స్థాయిలో బాగుచేస్తే ప్రయాణికులు, సందర్శకులకు ఇక్కట్లు తప్పనున్నాయి. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సి ఉంది. మంత్రి సీతక్క దృష్టి సారించి రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పగుళ్లతో ఇబ్బందులు
వెంకటాపురం నుంచి వై జంక్షన్ వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నాసిరకంగా పోసిన తారునూ ఇటీవల మళ్ళీ తవ్వారు. కానీ పనులు పూర్తి చేయకుండా వదిలేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– కొప్పుల రఘుపతి, జగన్నాధపురం
ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి
అసంపూర్తి పనుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డుపై తారు తొలగించి కంకర పోయడంతో దుమ్ము, దూళి అంతా మా ఇండ్లలోనే ఉంటోంది. పెద్ద పెద్ద గుంతల వల్ల వాహనదారులూ ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తి రోడ్ల కారణంగా చాలా ప్రమాదాలు జరిగాయి.
– వంకా రాములు, అంకన్నగూడెం