షూలేకున్నా ప‌రిగెత్తా

షూలేకున్నా ప‌రిగెత్తాదీప్తి జీవాంజీ.. ఓ మారు మూల గ్రామంలో పేదరైతు కుటుంబంలో పుట్టింది. తన గ్రామం తప్ప మరో ప్రపంచం తెలియని ఓ సాధారణ అమ్మాయి. పాఠశాల గురువుల సహకారంతో పరుగు మొదలెట్టింది. కోచ్‌ ప్రోత్సాహంతో రాటుదేలింది. పుట్టుకతో వచ్చిన అనారోగ్యాన్ని సైతం అధిగమించింది. ఒకప్పుడు కాళ్ళకు బూట్లు లేకున్నా చిరుతలా పరుగులు తీసింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. దేశానికి పతకాల వర్షం కురిపిస్తోంది. ఇటీవలె జపాన్‌లోని కోబ్‌ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక పారా అథ్లెటిక్స్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి, రాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న ఓరుగల్లు బిడ్డతో మానవి సంభాషణ…
మా సొంతూరు వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి మండలం, కల్లెడ గ్రామం. అమ్మ ధనలక్ష్మి, నాన్న యాదగిరి. ఇద్దరూ కూలి పనులు చేస్తే తప్ప మా కుటుంబం గడవదు. నాకు ఓ చెల్లి కూడా ఉంది. నేను కల్లెడలోని ఆర్‌డీఎఫ్‌ స్కూల్లో చదువుకునేదాన్ని. అప్పట్లో ఆగస్టు 15, జనవరి 26 సందర్భంగా స్కూల్లో గేమ్స్‌ పెడుతుండేవారు. అందులో పరుగుపందెం పడితే ఎప్పుడూ ఫస్ట్‌ వస్తుండేదాన్ని. బాగా పరిగెత్తుతున్నాని మా పీటీ సార్‌ బాగా ప్రోత్సహించేవారు. స్కూల్లో నాతో ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయించేవారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు ఎక్కడ జరిగినా తీసుకెళ్ళేవారు. అలా వెళ్ళిన ప్రతి సారీ ఫస్ట్‌ వచ్చేదాన్ని. ఒకసారి ఖమ్మంలో పోటీలు జరిగితే అక్కడికి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్‌ సార్‌ వచ్చారు. ఆ పోటీలప్పుడు నాకు షూ కూడా లేవు. అయినా పరిగెత్తాను. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను గెలవడంతో ఆయన నా గురించి మా పీటీ సార్‌ను అడిగారు.
ముందు ఇంట్లో ఒప్పుకోలేదు
‘గ్రామంలో ఉండటం కంటే హైదరాబాద్‌లో ఉంటే మంచి అవకాశాలు ఉంటాయి, మంచి గుర్తింపు ఉంటుంది, ప్రాక్టీస్‌ చేయడానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి’ అని రమేష్‌ సార్‌ నన్ను సాయి హాస్టల్‌కి రమ్మని అడిగారు. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అయితే మా అమ్మానాన్న ముందు ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఫిట్స్‌ ఉన్నాయి. ఎప్పుడు పడిపోతానో తెలీదు, పైగా ఆడపిల్లను. దాంతో అమ్మ వాళ్ళు అంత దూరం పంపించడానికి భయపడ్డారు. కానీ రమేష్‌ సార్‌, మా పీటీ సార్‌ నచ్చజెప్పి ‘తన బాధ్యతలన్నీ మేమే చూసుకుంటాం, మీరేం కంగారు పడొద్దు. తన ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని ధైర్యం చెబితే ఒప్పుకున్నారు.
ప్రపంచ రికార్డ్‌
2016లో హైదరాబాద్‌ వచ్చి సాయి హాస్టల్లో ఉండి ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. కోచ్‌ రమేష్‌ సార్‌ ఎంతో ప్రోత్సహించేవారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళాలంటే మా స్కూల్‌లోని రామ్మెహన్‌ సార్‌ నా ఖర్చులన్నీ చూసుకునేవారు. ఇప్పటికీ ఏదైనా అవసరం ఉంటే ఆయనే హెల్ప్‌ చేస్తుంటారు. నా పెర్ఫార్మెన్స్‌ బాగుందని పారాలో ఆడించడం మొదలుపెట్టారు. మొదటిసారి 2022లో మొరాకోలో జరిగిన పోటీల్లో పాల్గొంటే అక్కడ గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. తర్వాత 2023లో ఆస్ట్రేలియా వెళితే అక్కడ కూడా గోల్డ్‌ వచ్చింది. అదే ఏడాది చైనా ఏషిన్‌ గేమ్స్‌కు వెళ్ళి 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్‌ వచ్చింది. అలాగే ఏషియన్‌ గేమ్స్‌లో రికార్డ్‌ సాధించాను. ఈ ఏడాది మేనెలలో జపాన్‌లో జరిగిన పారా అథ్లెట్స్‌లో కూడా గోల్డ్‌ మెడల్‌తో పాటు ప్రపంచ రికార్డ్‌ బ్రేక్‌ చేశాను.
ఆర్థిక సమస్యలతో…
అమ్మానాన్న కొంత వరకు చదువుకున్నారు. అయితే క్రీడల గురించి పెద్దగా అవగాహన లేదు. చిన్నతనంలో మాత్రం కొంత భయపడ్డారు. తర్వాతర్వాత మెడల్స్‌ రావడంతో ఏదో సాధిస్తున్నాను అనే నమ్మకంతో ధైర్యంగా ఉన్నారు. అయితే మా బంధువుల్లో కొందరు మాత్రం అప్పట్లో ‘ఈ పిల్ల ఏం ఆడుతుంది, ఏం గెలుస్తుంది’ అని ఎగతాళి చేసేవారు. నేను మాత్రం వాళ్ళ మాటలు పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. కాకపోతే మా అమ్మానాన్న ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల బాగా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. అందుకే ఇవన్నీ మనకు అవసరమా అనుకునే వారు. ఇప్పుడు మాత్రం అందరూ నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అమ్మానాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రభుత్వం సహకరిస్తే…
అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న నన్ను రమేష్‌ సార్‌ 2022లో గోపిచంద్‌ ఆకాడమీలో చేర్పించారు. ప్రస్తుతం అక్కడే ఉంటూ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. ఊర్లో కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. దేశం తరపున ఆడుతున్నాను. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందలేదు. జాబ్‌ లేదు, ఉండటానికి ఇల్లు లేదు. స్పోర్ట్స్‌ కోటా నుండి ఉద్యోగం ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం గోపీ చంద్‌ ఆకాడమీలో ఉన్నాను కాబట్టి అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పటికీ కొంత ఆరోగ్య సమస్య ఉంది. అయినా ఎలాగైనా క్రీడల్లో ఎదగాలని సార్ల సహకారంతో పరిగెడుతున్నాను. దీనికి తోడు ప్రభుత్వం కూడా సహకరిస్తే దేశానికి ఇంకా ఎన్నో పతకాలు తీసుకువస్తాను.
అమ్మాయిలను ప్రోత్సహిస్తే…
మరో రెండు మూడు నెలల్లో పారిస్‌లో పారా ఒలింపిక్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం వాటికి ట్రైనింగ్‌ తీసుకుంటున్నాను. అమ్మాయిలందరూ స్పోర్ట్స్‌లోకి వచ్చి దేశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. అయితే అమ్మాయిలు ఈ రంగంలోకి రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు కావడంతో తల్లిదండ్రులు పంపడానికి కొంత భయపడుతున్నారు. అలాంటి భయాలు లేకుండా ప్రోత్సహిస్తే అమ్మాయిలు సాధించగలుగుతారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే మరింత ఆసక్తి చూపిస్తారు.

Spread the love