ఈ మినరల్‌ లోపిస్తే..

ఈ మినరల్‌ లోపిస్తే..ఈ రోజుల్లో చాలా మంది మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారు. మెగ్నీషియం లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. మెగ్నీషియం లోపిస్తే, కండరాల నొప్పులు, పట్టేయడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మెగ్నీషియం లోపం అధికంగా ఉంటే.. హాపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌, కరోనరీ ఆర్టరీ వ్యాధి, బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది.
ఇది మన శరీరంలో 300 కంటే ఎక్కువ ఎంజైమాటిక్‌ ప్రతిచర్యలలో పాల్గొంటుంది. చిన్న ప్రేగుల్లో ఆహార పోషకాలను గ్రహించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కార్బోహైడ్రేట్స్‌, కొవ్వు, ప్రోటీన్స్‌ నుంచి మనకు శక్తి వచ్చేలా మెగ్నీషియం సహాయపడుతుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం శక్తితోపాటు, ప్రశాంతంగా నిద్రపట్టేలా తోడ్పడుతుంది. ఇది శరీరంలోని నరాలు, కండరాల పనితీరును నియంత్రిస్తుంది. హార్ట్‌బీట్‌ సమంగా ఉంచుతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియంను శరీరం శోషించుకోవాలి. ఇందుకు మెగ్నీషియం తోడ్పడుతుంది.
లక్షణాలు..
మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు, వికారంగా ఉంటుంది, వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది, నీరసంగా, నిస్సత్తువగా ఉంటుంది, హార్ట్‌ బీట్‌రేట్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి, కళ్ళు మసక బారినట్లు ఉంటుంది, కండరాలలో నొప్పి వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, నిద్రలేమి వంటి లక్షణాలు కనిస్తాయి.
మన డైట్‌ క్రమం తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే మెగ్నీషియం లోపం నుంచి బయటపడవచ్చు. ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్‌ బెర్రీస్‌, ఫిగ్స్‌ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా మెగ్నీషియం ఎక్కువగా దొరుకుతుంది. బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది.

Spread the love