స్మార్ట్‌ ఫోన్‌ ఆమె జీవితాన్నే మార్చివేసింది

స్మార్ట్‌ ఫోన్‌ ఆమె జీవితాన్నే మార్చివేసిందిశ్రీదేవి బాయి… తన పిల్లలకు మెరుగైన జీవితం, నాణ్యమైన విద్య అందించడం ఆమె కల. కానీ ఆర్థిక ఇబ్బందులు దానికి అడ్డంకిగా మారాయి. భర్త నెల జీతంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఏం చేయాలో తోచని ఆమెకు ఆలోచిస్తే అవకాశాలు బోలెడున్నాయనిపించింది. తనకొచ్చిన ఎంబ్రాయిడరీనే ఆదాయ వనరుగా మార్చుకోవాలనకుంది. అయితే మార్కెట్‌ ఆమెకు సహకరించలేదు. అటువంటి సమయంలోనే తన స్మార్ట్‌ ఫోన్‌ ఆమె జీవితాన్నే మార్చివేసింది. సాంకేతికత లో శిక్షణ తీసుకుని తన ఉత్పత్తులను విక్రయిస్తూ వ్యాపారాన్ని విస్తరింప చేసుకుంటుంది. అదెలాగో మనమూ తెలుసుకుందాం…
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జన్మించిన శ్రీదేవి వివాహానంతరం కర్ణాటకలోని రాయచూర్‌లో స్థిరపడింది. భర్త ప్రైవేట్‌ ఉద్యోగి. తన పిల్లలకు విలువైన విద్యను అందించాలనేది ఆమె కల. భర్త ఉద్యోగం చేసి ప్రతినెలా జీతం తెస్తున్నా ఆ ఆదాయం వారి కుటుంబానికి సరిపోయేది కాదు. దాంతో ఆ దంపతులు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు తను కూడా ఏదైనా చేసి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది శ్రీదేవి. దానికి ఓ మార్గాన్ని కనుగొన్నది.
పరిస్థితులు అనుకూలించక
ప్రతిభావంతులైన శ్రీదేవికి ఎంబ్రాయిడరీలో మంచి ప్రావీణ్యం ఉంది. దాన్నే తన ఆదాయ మార్గంగా మలుచుకోవాలనుకుంది. వెంటనే అందుబాటులో ఉన్న అందమైన గుడ్డ ముక్కలపై ఎంబ్రాయిడరీ చేసి స్థానిక మార్కెట్‌లో తన ఉత్పత్తులను విక్రయించడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు అనుకూలించక మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చేది. ఎంత శ్రమించినా ఆదాయం పెరగక పోవడంతో కొంత నిరాశకు గురయ్యింది. తన సంపాదనతో పిల్లల స్కూలు ఫీజు కూడా కట్టలేకపోయేది. ఎంత శ్రమించి అయినా పిల్లలకు మెరుగైన జీవితం, సరైన విద్యను అందించాలని నిశ్చయించుకున్న ఆమె తన ఖాళీ సమయంలో పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. అయితే ఇది కొంత కాలం వరకు మాత్రమే చేసింది.
బీయింగ్‌ ది చేంజ్‌
తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆమె జీవితం మంచి మలుపు తీసుకోవడం ప్రారంభించింది. ూడు టెక్నాలజీ సర్వీసెస్‌తో కలిసి నాస్కామ్‌ ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న డిజిటల్‌ అప్‌స్కిల్లింగ్‌ ఆఫ్‌ రూరల్‌ ఉమెన్‌ ఆర్టిసన్స్‌ ప్రోగ్రామ్‌ ఆమెకు సాంకేతికత విద్యను అందించి జీవితంలో కొత్త తలుపు తెరిచింది. సాంకేతికత, డిజిటల్‌ నైపుణ్యాల శిక్షణ ద్వారా గ్రామీణ మహిళా హస్తకళాకారులకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించబడింది. మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి వారు సాంకేతికతను ఉపయోగించుకునేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకుంటూ సంప్రదాయ కళలను కాపాడుకోవడంపై ఇది దృష్టి సారిస్తోంది.
మహిళల కోసమే…
కొత్త అవకాశాలను అన్వేషించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మెరుగుపరచుకోవడం పట్ల నిత్యం ఆసక్తిగా ఉండే శ్రీదేవి తన కూతురి స్నేహితురాలి ద్వారా దాని గురించి విన్నది. వెంటనే ప్రోగ్రామ్‌ కోసం సైన్‌ అప్‌ చేసింది. శ్రీదేవి ఏమి నేర్చుకుంటుంది, ఎలా నేర్చుకుంటుంది అనే ఆసక్తితో పాటు, ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మహిళల కోసం ఉద్దేశించబడింది. దాంతో ఆమె దరఖాస్తు చేసుకోవడానికి మరింత ఆసక్తి చూపించింది. ఆ ప్రోగ్రామ్‌ ఆమెకు సురక్షితంగా, సౌకర్యవంతంగా అనిపించింది.
ఒక బలమైన పునాది
నాస్కామ్‌ ఫౌండేషన్‌ వారి ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో భాగమైన శ్రీదేవి టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుంది. తన ఆన్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రారంభించడంలో కీలకమైన సాంకేతికత, దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటూ క్రమంగా ఒక బలమైన పునాదిని నిర్మించింది. భవిష్యత్తులో ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రేతగా చేరాలని నిర్ణయించుకున్న ఆమె కొత్త సేల్స్‌ ఛానెల్‌లను అన్వేషించడానికి సైతం సిద్ధంగా ఉంది. అలాగే డిజిటల్‌ చెల్లింపు యాప్‌ల ద్వారా లావాదేవీలతో సహా బ్యాంకింగ్‌ కార్యకలాపాలలో నైపుణ్యాన్ని సంపాదించింది. మొత్తంమీద ఈ ప్రోగ్రామ్‌ డిజిటల్‌ రంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు, తన వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచడానికి అవసరమైన సాధనాలు, జ్ఞానాన్ని ఆమెకు అందించింది.
ముందున్న మార్గం
దేనికీ అధైర్యపడకుండా ముందుకు సాగితే ఆకాశమే తన హద్దు అని శ్రీదేవి ఇప్పుడు తెలుసుకుంది. ఆమె ఇప్పుడు తన వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని చూస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని రుణాలను పొంది తన వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసుకునేందుకు ప్రణాళికను రూపొందించుకుంటోంది. తనకు ఇంత మంచి వేదికను అందించిన ప్రోగ్రామ్‌కు ఆమె ధన్యవాదాలు తెలియచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ శ్రీదేవి కొంత వరకు ఆదా చేసుకోగలిగింది. ‘నా అంతిమ లక్ష్యం నా పిల్లలకు మెరుగైన జీవితాన్ని, సరైన విద్యను అందించడం. ఆర్థిక ఇబ్బందులతో వచ్చే ప్రతికూలతలను అధిగమించగలనని నేను నమ్ముతున్నాను’ అంటూ ఆమె తన కోసం మరో ప్రత్యేకమైన భాగాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉంది.
– సలీమ

Spread the love