ఉక్రెయిన్‌ ప్రధాన సైనిక కార్యాలయంపై రష్యా దాడి

యుద్ధ క్షేత్రంలోని దక్షిణ సెక్టార్‌లోగల ఉక్రెయిన్‌ సైనిక ప్రధాన కార్యాలయంపై రష్యా దాడి చేసిందని మాస్కోలోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మిలిటరీ ఇన్‌స్టాలేషన్లు, ఉక్రేనియన్‌ దళాలు, హార్డ్‌వేర్లు రష్యా సంయుక్త వాయు, క్షిపణి, ఫిరంగి దాడులలో దెబ్బతిన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఓడరేవు నగరం ఒడెస్సా మధ్యలో ఉన్న ఉక్రేనియన్‌ సైనిక ప్రధాన కార్యాలయాన్ని రష్యా సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు ఆర్‌ఐఏ నొవోస్తి వార్తాసంస్థ రిపోర్ట్‌ చేసింది. ఈ ప్రాంతంలో మూడు పేలుళ్లు సంభవించాయని, ముఖ్యంగా అత్యంత శక్తివంతమైన పేలుడు సైనిక కార్యాలయానికి సమీపంలో సంభవించిందని, అనేక అంబులెన్స్‌లు సైనిక ప్రధానకార్యాలయం వైపు తరలివస్తున్నట్లు, ఆ ప్రాంతాన్ని ఉక్రేనియన్‌ అధికారులు చుట్టుముట్టినట్టు ఆర్‌ఐఏ నొవోస్తి రాసింది. నగరంపై క్షిపణి దాడి జరిగిందని, పౌర మౌలిక సదుపాయాలు మాత్రమే దెబ్బ తిన్నాయని, ముగ్గురు మాత్రమే చనిపోయారని ఒడెస్సా ప్రాంతీయ పరిపాలన అధిపతి ఒలేగ్‌ కిపర్‌ ధృవీకరించాడు. రక్షణ కార్యకలాపాలకు మద్దతిచ్చే సైనిక స్థాపనలు, సౌకర్యాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామని రష్యా పదేపదే చెబుతూ, పౌర మౌలిక సదుపాయాలను ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోవద్దని నొక్కి చెప్పింది. రష్యా సరిహద్దులోని ఖార్కోవ్‌ నగర శివారులోని ఉక్రేనియన్‌ దళాలను సన్నద్ధం చేసే ప్రాంతంపై రష్యా బాంబు దాడి చేసిందని, మరో దాడి దక్షిణ నికోలెవ్‌ ప్రాంతంలో మిలిటరీ హార్డ్‌వేర్‌ నిల్వ చేసే గిడ్డంగిని ధ్వంసం చేసిందని కూడా ఆర్‌ఐఏ నొవోస్తి వార్తాసంస్థ రిపోర్ట్‌ చేసింది.రష్యా అనుకూల ప్రతిఘటన ఉద్యమం అనేక ఉక్రేనియన్‌ ప్రాంతాలలో చురుకుగా డేటాను సేకరిస్తూ కీవ్‌ సైన్యానికి వ్యతిరేకంగా ధ్వంసానికి పాల్పడుతోందని యుద్ధ క్షేత్రంనుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పాశ్చాత్య దేశాలు సరఫరా చేస్తున్న సైనిక పరికరాలను నిలువచేసే లాజిస్టిక్స్‌ హబ్‌లు, గిడ్డంగులపై దాడులను తీవ్రతరం చేస్తామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు గత నెలలో ప్రకటించిన తరువాత ఈ దాడుల పరంపర కొనసాగుతోంది.

Spread the love