సలీం అండ్‌ కంపెనీ లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలి

– చెంగిచెర్ల కబేలాను ఐదేండ్లుగా తాత్కాలిక లీజుకు ఎలా ఇస్తారు? : సీపీఐ(ఎం) నేతలు ఎం.శ్రీనివాస్‌, పి.సత్యం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్లలోని ఆధునిక కబేలా నిర్వహణ లీజు 2018 జులైలో ముగిసినప్పటికీ తాత్కాలిక లీజుకు పాత రేట్లతో మహమ్మద్‌ సలీం కంపెనీని ఎందుకు కొనసాగిస్తున్నారని సీపీఐ(ఎం) హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌, పి.సత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌ గోల్కొండ క్రాస్‌ రోడ్డులోని సీపీఐ(ఎం) సిటీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కబేలా తాత్కాలిక లీజును రద్దు చేసి టెండర్లను ఆహ్వానించాలని, టెండర్‌ లేకుండా ఐదేండ్లుగా లీజును ఎలా కొనసాగిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీని వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జోక్యం చేసుకోవాలని కోరారు. లీజు రెంటు రూ.10 కోట్లు చెల్లించాలని అధికారులు నోటీసు ఇచ్చినప్పటికీ మహమ్మద్‌ సలీం అండ్‌ కంపెనీ నోటీసును బేఖాతరు చేసిందన్నారు. ఆయినా వారిపై నేటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. కబేలా కాంట్రాక్ట్‌ పొందిన మహమ్మద్‌ సలీం.. అంతకు ముందు ఒక బోర్డ్‌ చైర్మెన్‌గా పని చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ హౌదాలో ఉండి కాంట్రాక్ట్‌ పొందడం పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలోని చెంగిచెర్ల ఆధునిక కబేలా మాంసం ఎగుమతుల కేంద్రంగా కొనసాగుతూ సలీం అండ్‌ కంపెనీకి కాసుల వర్షం కురిపిస్తున్నదన్నారు. ఆ కంపెనీ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసి బకాయిలను వసూలు చేయాలని, స్థానిక వృత్తిదారుల సొసైటీకి కబేలా నిర్వహణ అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రతినిధిగా కాంటాక్ట్‌ పొందిన మహమ్మద్‌ సలీంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Spread the love