Monday, July 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి

సంగారెడ్డిని కరువు జిల్లాగా ప్రకటించాలి

- Advertisement -

వర్షాలు లేక పంటలు నష్టపోతున్న
రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సింగూర్‌ ప్రాజెక్టు రీపేర్‌‌లో తీవ్ర జాప్యం
జలాశయంలో నీళ్లులేక సాగు, తాగునీటి ఎద్దడి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి

ఎల్‌ ‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావం వల్ల ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, సంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఆదివారం కేవల్ కిషన్ భవన్‌లో నిర్వహించిన సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలు పడకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాలన్నారు. కరువు భారాలు రైతులపై పడకుండా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. సంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు కూడా పెరిగిపోయి రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాలు లేక సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్‌, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వర్షాధార పంటలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ముఖ్యంగా పత్తి, కంది, మినుము, పెసర వంటి పంటలు సాగు చేసే రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తేమ లేకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తే దశలోనే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. సింగూర్ ప్రాజెక్టు రిపేర్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. దీంతో ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో 40 వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరువు ప్రాంతాలుగా ఉన్న నారాయణఖేడ్‌, జహీరాబాద్‌‌తో పాటు ఆందోల్‌ ప్రాంతానికి సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పెండింగ్‌‌లో పెట్టారన్నారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టుల్ని వెంటనే పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. సింగూరూ ప్రాజెక్టులో నీళ్లు ఖాళీ చేయడం వల్ల పంటలకు సాగునీరే కాకుండా సంగారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌‌ ప్రజలకు తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సరఫరా లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ పూర్తిస్థాయిలో యూనిఫాం, బుక్స్, టాయిలెట్స్, ఇతర సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, అతిమెల మానిక్, కె. రాజయ్య, జి.సాయిలు, రాంచందర్, ఎం. నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, నాగేశ్వర్ రావు, యాదగిరి, మహిపాల్, విద్యాసాగర్, రేవంత్, కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -