చికిత్స పొందుతూ పారిశుద్ధ్య కార్మికుడు మృతి

– నిరుపేద గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి (గుండాల)
ఈనెల 10వ తేదీన గుండాల మండల కేంద్రానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఈసం గోపయ్య (55) మండల కేంద్రంలోని రామాలయం దగ్గర ప్రధాన వీధిలో పారిశుద్ధ్యం పనులు చేస్తుండగా మేడారం సమీపంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన చందా నివాస్ అనే యువకుడు మరో యువకుడితో కలిసి పల్సర్ బైక్ తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఘటన విదితమే. దాంతో గత పది రోజులుగా ఖమ్మం మమతా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతున్నాడు. అక్కడ గోపయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కలరు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు గుండాల పోలీస్ స్టేషన్ ఎస్సై కిన్నెర రాజశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గోపయ్య నిరుపేద గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
Spread the love