సుదూర కలగా సర్కారీ కొలువు

Sarkari Kolu as a distant dream– నిరుద్యోగులకు కష్టంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాలు
– అవకతవకలు, రిజర్వేషన్ల గొడవ, కోర్టుల్లో కేసులు పెండింగ్‌
– మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాదీ ఉద్యోగాల భర్తీ అనుమానమే
– ఆందోళనలో నిరుద్యోగ యువత
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందటం అక్కడి నిరుద్యోగులకు కష్టతరంగా మారింది. సర్కారీ కొలువు కోసం ఏండ్లుగా కష్టపడుతున్న యువతీ, యువకులకు ఈ ఏడాదిలోనూ వారి కలలు సాకారమయ్యే పరిస్థితులు కనబడటం లేవు. రిజర్వేషన్ల అంశం, నియామకాల్లో అవకతవకలు, కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటం వంటివి వీటికి కారణాలుగా కనబడుతున్నాయి.
మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎంపీపీఎస్సీ) 2024లో 60 మంది సెకండ్‌-గ్రేడ్‌ ఆఫీసర్లు (గ్రూప్‌ బీ)ను నియమించుకోవటానికి గతేడాది డిసెంబర్‌ 31న ఒక ప్రకటనను ప్రచురించింది. ఇది దశాబ్ద కాలంలో అత్యల్పమైనది. ఇందులో డిప్యూటీ కలెక్టర్లు 15, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులు 22 కలిపి ఏడు విభాగాలకు మాత్రమే పోస్టుల భర్తీకి కమిషన్‌ ప్రకటన చేసింది. 2024 క్యాలెండర్‌ ఇయర్‌ లాగా, గత ఐదేండ్లలో 2019 నుంచి 2023 మధ్య, సెకండ్‌ గ్రేడ్‌ ఆఫీసర్ల కోసం 1808 ఖాళీలకు మాత్రమే కమిషన్‌ నోటిఫికేషన్‌లు జారీ చేసింది. అయినప్పటికీ, 2019, 2020 సంవత్సరాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి కాలేదని నిరుద్యోగులు ఆందో ళనలు వ్యక్తం చేస్తున్నారు.
పోటీ పరీక్షల్లో అవినీతి, అవకతవకల ఆరోపణలతో పాటు, 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌పై వివాదం, పెరుగుతున్న కోర్టు వ్యాజ్యాలు, పట్వారీ పరీక్షపై ఇటీవలి వివాదం రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్‌ను దాదాపుగా నిలిపివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు, అంటే గతేడాది జులైలో 6,000 మంది పట్వారీల రిక్రూట్‌మెంట్‌లో ‘ఫౌల్‌ ప్లే’ అంశాన్ని కాంగ్రెస్‌ లేవనెత్తింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రాజేంద్ర కుమార్‌ వర్మ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. కానీ దర్యాప్తు బృందం అనేక పొడిగింపులను ఇచ్చింది. ఆరు నెలల తర్వాత కూడా అది ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను నియమించేందుకు రెండు ఏజెన్సీలు ఉన్నాయి. అవి, మధ్యప్రదేశ్‌ ఉద్యోగుల ఎంపిక బోర్డు (ఎంపీఈఎస్‌బీ), మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎంపీపీఎస్సీ). ఎంపీపీఎస్సీ రెండో గ్రేడ్‌ అధికారులను నియమించే బాధ్యతను కలిగి ఉంటుంది. అయితే ఎంపీఈఎస్‌బీ గ్రేడ్‌-3, కొంతమంది గ్రేడ్‌-4 ఉద్యోగులను నియమిస్తుంది. ఎంపీఈఎస్‌బీని గతంలో వ్యాపమ్‌ అని పిలిచేవారు. ఇది వ్యాపమ్‌ స్కామ్‌గా అపఖ్యాతి పాలైన తర్వాత మూడుసార్లు పేరు మార్చబడటం గమనార్హం. ”పట్వారీ పరీక్ష వివాదం నుంచి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌పై కొనసాగుతున్న వివాదం దృష్ట్యా, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు అన్ని నియామక ప్రక్రియలను నిలిపివేసాయి” అని ఎంప్లాయీ సెలక్షన్‌ బోర్డ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ”అంతేకాకుండా, విచారణ కారణంగా ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహించడానికి బోర్డు నియమించిన బెంగళూరుకు చెందిన ప్రయివేట్‌ కంపెనీ ఎడ్యుక్విటీ కెరీర్‌ టెక్నో ప్రయివేట్‌ లిమిటెడ్‌కు వారి ప్రమేయం ఉన్నందున డిపార్ట్‌మెంట్‌ కొత్త ప్రాజెక్ట్‌లను కేటాయించలేదు” అని చెప్పారు.మధ్యప్రదేశ్‌ ప్రొఫెషనల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (ఎంపీపీఈబీ)గా పిలువబడే ఎంప్లాయీ సెలక్షన్‌ బోర్డ్‌ (ఈఎస్‌బీ) ఫిబ్రవరి 2021లో 862 పోస్టులకు అగ్రికల్చర్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌ ఫలితాలను ప్రకటించింది. అయితే, ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభుత్వం విచారణ ప్రారంభించి, పరీక్షను రద్దు చేసింది.
వివిధ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో ఫౌల్‌ ప్లే ఆరోపణల కారణంగా ఆశావహులు హైకోర్టుల జోక్యాన్ని కోరవలసి వచ్చింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులోని మూడు బెంచ్‌ల ముందు 223 కేసులు, సుప్రీంకోర్టులో నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 2019, మార్చ్‌లో రాష్ట్రంలో 14 శాతం ఉన్న ఓబీసీ కోటాను 27 శాతానికి పెంచింది. దీనిపై నిర్ణయం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
రాష్ట్రంలో 41.87 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉన్నట్టు సమాచారం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం కీలకంగా మారింది. ఇందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌లోని లాల్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో 2022 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఒక సంవత్సరంలో 1.17 లక్షల ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తానని ప్రకటించారు.
అయితే, కాంట్రాక్టు, జాతీయ ఆరోగ్య మిషన్‌ సిబ్బందితో సహా సీ, డీ గ్రేడ్‌లకు 58,631 మందిని మాత్రమే నియమించుకున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పట్వారీ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష వివాదాన్ని రేకెత్తించిన తర్వాత దాదాపు 35,000 పోస్టుల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు ఇంకా మిగిలిన పోస్టుల కోసం ప్రకటనలను ప్రచురించాల్సి ఉంది.
వచ్చే ఐదేండ్లలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌ అంశం, కోర్టు వ్యాజ్యాలే అతిపెద్ద సమస్య అని అధికారులు చెప్తున్నారు. అయితే, బీజేపీ సర్కారు మళ్లీ అధికారంలోకి వచ్చినందున ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

Spread the love