పాఠశాల విద్యా కమిషనర్‌ శ్రీదేవసేన బదిలీ

పాఠశాల విద్యా కమిషనర్‌ శ్రీదేవసేన బదిలీనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన బదిలీ అయ్యారు. దీంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఈవి నర్సింహారెడ్డి బుధవారం బాధ్యతలను స్వీకరిస్తారు. ఇటీవల ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగే వరకు శ్రీదేవసేన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. ఆ జిల్లాలోనూ బుధవారం స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులను ఉపాధ్యాయులకు కల్పిస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా నిర్వహించారు. దీంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ బాధ్యతల నుంచి ఆమె మంగళవారం బదిలీ అయ్యారు. అదేరోజు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేన బాధ్యతలను స్వీకరిస్తారు.
శ్రీదేవసేనకు ఆర్‌యూపీపీటీఎస్‌ సన్మానం
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, అదనపు సంచాలకులు కె లింగయ్యను ఆర్‌యూపీపీటీఎస్‌ అధ్యక్షులు సి జగదీశ్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ నర్సిములు మంగళవారం హైదరాబాద్‌లో సన్మానించారు. భాషాపండితులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల గురించి వివరించారు. మల్టీజోన్‌-2 పరిధిలో భాషాపండితుల సీనియార్టీ తేదీలకు అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలోని వారికీ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పదోన్నతులు రాకుండా మిగిలిపోయిన భాషాపండితులకు కూడా అవకాశం కల్పించాలని సూచించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ భాషల ఖాళీ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని కోరారు. ఇంకా మిగిలితే అప్‌గ్రేడ్‌ చేయడానికి కావాల్సిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్‌ కోశాధికారి గిరిజారమణ, ప్రచార కార్యదర్శి లింగంతోపాటు అన్నిజిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love