– జీవో 59 ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి
నవతెలంగాణ-నర్సంపేట
నిబంధనలకు విరుద్ధమైన ప్రయివేటు పాఠశాలలను వెంటనే మూసివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి శివరాత్రి ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో యార ప్రశాంత్ మాట్లాడారు. వరంగల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా డీజీ, టెక్నో, ఐఐటీ పేరుతో పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద వేలాదిగా ఫీజులు వసూళ్లు చేస్తూ మోసగిస్తున్నారన్నారు. జివో 59 ప్రకారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే ఫీజులను వసూళ్లు చేయాల్సి ఉండగా నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా యాజమాన్యాలు వ్యవహరిస్తూ దోపిడి చేస్తున్నాయని విమర్శించారు. బుక్స్, యూనిఫారమ్, అడ్మిషన్‌ల పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. అనేక పాఠశాలలో మౌళిక సౌకర్యాలు లేకుండా పోయాయన్నారు. వెంటనే విద్యాధికారులు పాఠశాలలను పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టాలన్నారు. నిబంధనలను అతిక్రమించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకొంటూ పాఠశాలలను మూసివేయాలన్నారు. లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాకేష్, నాయకులు పొన్నాల తరుణ్, మంజలి, విజరుకాంత్, విష్ణువర్థన్, వంశీ, నాగరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.