Monday, July 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేసీఆర్‌ను తిడితే నీళ్లు రావు

కేసీఆర్‌ను తిడితే నీళ్లు రావు

- Advertisement -

గోదావరిని ఎత్తిపోస్తేనే వస్తాయి
ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదు..
సీఎం నిర్లక్షం వల్ల వచ్చింది
సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
కాళేశ్వర్ం నీళ్ల కోసం చిన్నకోడూరు రైతుల పాదయ్రాత


నవతెలంగాణ-చిన్నకోడూరు
​మాజీ సీఎం కేసీఆర్‌ను తిడితే కాలువల్లోకి, చెరువుల్లోకి నీళ్లు రావని.. గోదావరిని ఎత్తిపోస్తేనే నీళ్లొస్తాయనే వాస్తవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గ్రహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఆయన ఫైర్ అయ్యారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు స్వచ్ఛందంగా చేపట్టిన 15 కిలోమీటర్ల మహా పాదయాత్రలో హరీశ్‌‌రావు పాల్గొని మాట్లాడారు. కరువు నుంచి బయటపడేందుకు వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై రాజకీయ పగతో కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ను తిడితే నీళ్లు రావు, గోదావరిని ఎత్తిపోస్తేనే వస్తాయనే వాస్తవాలను ప్రభుత్వ పెద్దలు గ్రహించాలని హితువు పలికారు. వెంటనే పంపులు ఆన్ చేసి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లను నింపాలన్నారు. మోటార్లు ఆన్ చేయకుండా 70 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు వదిలేశారని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ హయాంలో ఎన్నడూ కరవు రాలేదన్నారు. రైతులు ఫోన్ చేస్తే కాలువ గేట్లు ఎత్తి పంటలు పారించారన్నారు. ప్రస్తుత కరవు ప్రకృతి వైఫరిత్యం వల్ల వచ్చింది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తెచ్చిన కరవు అంటూ మండిపడ్డారు. రైతులకు రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి, కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే వేసి సగం మంది రైతుల్ని మోసం చేశారన్నారు. మూడు పంటలకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రైతు బంధుకు ఎగనామం పెట్టారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెచ్చిన రైతుబీమాను పూర్తిగా నిలిపివేశారన్నారు.

గతంలో ఎరువుల కొరత లేకుండేదని, నేడు యూరియా కోసం యాప్‌లు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటలు కరెంట్ ఉంటే, ప్రస్తుతం 10 గంటలు కూడా రావడం లేదని ఆరోపించారు. యాసంగి వడ్ల కొనుగోళ్లలో క్వింటాల్‌కు 4 కిలోల తరుగు తీసి మిల్లర్ల చేతుల్లో రేవంత్ రెడ్డి తోలుబొమ్మగా మారారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల కోసం భద్రాద్రి రాముడు, యాదాద్రి నరసింహస్వామి, కొమరవెల్లి మల్లన్నలపై ఒట్లు వేసిన రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. దేవుళ్లను మోసం చేసినందుకే రాష్ట్రానికి ఈ అరిష్టం, కరవు పట్టిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి హిట్లర్‌లా ప్రవర్తిస్తూ.. కాళేశ్వరం మోటర్లను ఆన్ చేయాలని కోరిన రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెడతానని బెదిరించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలన్నారు. లేకపోతే చిన్నకోడూరు రైతుల స్ఫూర్తితో అన్ని మండలాల్లో పోరాటాన్ని ఉధతం చేస్తామన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షు‌లు కాముని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, సిద్దిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ పాల సాయిరాం, టిఆర్‌ఎస్ నాయకులు ఉమేష్ చంద్ర, మేడికాయల వెంకటేశం, జంగిటి శ్రీనివాస్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -