వందల ఎకరాల్లో అసైన్డ్ భూములకు పట్టా హక్కులు
ఫోరెన్సిక్ ఆడిట్‌తో లోగుట్టు రట్టు
నిబంధనలకు విరుద్ధంగా క్రయ, విక్రయాలు
పోతిరెడ్డిపల్లిలో సర్వేనంబర్ 153, 154, 155, 161…
సంగారెడ్డి మండలం ఫసల్‌వాదీలో సర్వేనంబర్ 543, 548
భూ మార్పిడి దందాపై మొదలైన విచారణ
నవతెలంగాణ`- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చే అవకాశం లేదు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించి మార్పు చేస్తే చట్టరీత్య నేరం. కానీ ధరణి పోర్టల్ సహాయంతో కొందరు అధికారులు ఆపరేటర్లతో కలిసి వందల ఎకరాల అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి అసైన్డ్, ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చారు. రెవెన్యూ లోగుట్టుపై నవతెలంగాణ పలు వరుస కథనాలను ప్రచురించింది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాలో ధరణి ద్వారా జరిగిన లావాదేవీలు, పట్టామార్పిడిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందల ఎకరాల అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చునట్టు విచారణలో తేలుతుంది.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెలుగుచూస్తున్న భూ బండారం
నిబంధనలు విస్మరించి కొందరు రెవెన్యూ అధికారులు ధరణి పోర్టల్ లో ప్రభుత్వ, అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చినట్టు నిర్ధారణైంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో యజమానులకు తెలియకుండా చేపట్టిన లావాదేవీలపై సాంకేతికతను వినియో గించి చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో అనేక అక్రమాలు తేలాయి. భూ అక్రమ లావాదేవీల ఘటనలో తహసీల్దార్ సుజాతపై చర్యలు తీసుకోవడం చర్చనీ యాంశమైంది. సంగారెడ్డిలో 1,08,187 ఎకరాల భూమిని నిరు పేదలతో పాటు ఇతర ప్రభుత్వ అవసరాల కు అసైన్డ్ చేశారు. రెవెన్యూ అధికారుల శాఖాపరమైన విచారణలో మూడువేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి పట్టాభూమిగా మారినట్టు గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో 448 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టాభూములుగా మార్పిడి చేసినట్టు ప్రాథమికంగా తేల్చారు. భూదాన్ భూములు 5,507 ఎకరాలుండగా వీటిలో 2,890 ఎకరాలను సాగు నిమిత్తం పంపిణీ చేశారు. పంపిణీ చేసిన భూమితో పాటు దానం చేసిన వాటి లెక్కలు రెవెన్యూ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. దీనికి తోడు రూ.కోట్ల విలువైన భూదాన్ భూములు బడా బాబుల చేతుల్లో ఉన్నట్టు గుర్తించారు. మెదక్ జిల్లాలో నిషేధిత భూముల జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను తొలగించి బై నంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేశారు.
పట్టా మార్పిడిలో ఆపరేటర్ల కీలక పాత్ర
పట్టాల మార్పిడిలో ధరణి ఆపరేటర్లు కీలకపాత్ర పోషించినట్టు అందిన సమాచారం మేరకు విచారణ ప్రారంభించారు. డిజిటల్ లావాదేవీలు, రికార్డుల మార్పులు జరిగినప్పుడు అనుమానాలు తలెత్తితే వాటిని నిగ్గు తేల్చేందుకు, అక్రమాలను నిరూపించే సాక్ష్యాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం ఆడిట్ చేపట్టారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి, సంగారెడ్డి జిల్లా కంది, సంగారెడ్డి మండలాల్లో నిషేధిత జాబితా నుంచి అసైన్డ్ భూములను తొలగించిన అక్రమాలు జరిగాయని తేల్చారు. ఫోరెన్సిక్ ఆడిట్‌తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ధరణి, భూ-భారతి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీలపై అంతర్గతంగా రెవెన్యూశాఖ విచారణ చేపట్టింది. గతంలో ఉమ్మడి జిల్లాలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా భూములను మార్పిడి చేయడంతో పాటు నిషేదిత జాబితా నుంచి ప్రభుత్వ, అసైన్డ్ భూములను తొలగించి అక్రమార్కులకు కొమ్ముకాసినట్టు పిర్యాదులున్నాయి.
పేదల అసైన్డ్ భూములను పట్టాలుగా మార్పు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లిలో సర్వేనంబర్ 153, 154, 155, 161లో పేదలకు చెందిన అసైన్డ్ భూములను బడాబాబులకు కట్టబెట్టారు. అంతే కాకుండా యధేచ్ఛగా వాటిని పట్టాభూములుగా మార్చారు. ఎన్‌ఓసీలు కూడా జారీ చేశారు. పోతిరెడ్డిపల్లిలో 250 ఎకరాల అసైన్డ్ భూములుండగా అట్టి భూముల్లో బడారాజకీయ నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు కలిసి పేదల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని పట్టాభూములుగా మార్చుకున్నారు. సర్వేనంబర్ 153లో మొత్తం 52 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. కొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో జిల్లా ఉన్నాతాధికారుల సహాకారంతో అసైన్డ్ భూములకు ధర్జాగా ఎస్ఓసీలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదీ గ్రామంలో సర్వేనంబర్ 543, 548 లో ఉన్న అసైన్డ్ భూములను మార్చారు. అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చడం, వాటిని కొనుగోళు చేయడం, విక్రయించే ప్రక్రియలో రిజస్ట్రేషన్లు జరిగి పూర్తి పట్టా భూములుగా మార్చుకున్నారు. .
భూముల మార్పులో ఉన్నదాధికారుల సాయం జి.జయరాజ్, సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి
సంగారెడ్డి జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు పైగా అసైన్డ్ భూములున్నాయి. అందులో మూడు వేల ఎకరాలకు పైగా ఉన్నతాధికారుల సహాకారంతో పట్టా భూములుగా మార్చారు. ఉన్నతాధికారులే అవినీతికి పాల్పడితే ఇక పేదలకు రక్షణ ఎక్కడుంటుంది. పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలంటే భూములు లేవని చెబుతారు. బడా బాబులకు మాత్రం అసైన్డ్ భూములు అప్పగిస్తున్నారు.
భూదాన్ భూముల ఆక్రమణ కె.నర్సమ్మ, సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కార్యదర్శి
మెదక్ జిల్లాలో భూదాన్ భూములు 5,507 ఎకరాలుండగా వీటిలో 2,890 ఎకరాలను సాగు నిమిత్తం పంపిణీ చేశారు. పంపిణీ చేసిన భూమితో పాటు దానం చేసిన వాటి లెక్కలు రెవెన్యూ అధికారుల వద్ద లేవు. రూ.కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూములు బడా బాబుల చేతుల్లో ఉన్నట్టు విచారణలో తేలింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. భూముల్ని కాపాడాలి.
సమగ్ర విచారణ జరిపించాలి
సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున పేదలకు పంచిన అసైన్డ్, ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పట్టా భూములుగా మార్చారు. వాటిపై సమగ్ర విచారణ జరపాలి. ఫోరెన్సిక్ ఆటిట్‌లో కుకునూ ర్‌పల్లి తహాసీల్దార్ మాత్రమే బయట పడ్డారు. ఇంకా కొన్ని మండలాల్లో ఇదే తరహా మార్పులు జరుగాయి. ధరణీ సహాయంతో తహస ీల్దార్లు, ఉన్నతాధికారులు, ఆపరేటర్లు కలిసి బరితెగిం చారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను రక్షించాలి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
-ఆముదాల మల్లారెడ్డి సీపీఐ(ఎం)
సిద్దిపేట జిల్లా కార్యదర్శి



