Monday, July 20, 2026
E-PAPER
Homeజాతీయంఅది అశ్లీలత కాదు

అది అశ్లీలత కాదు

- Advertisement -

దూషణలు, అసభ్య పదజాలంపై సుప్రీం
న్యూఢిల్లీ
: దూషణలు, అసభ్య పదజాలం ఉపయోగించినంత మాత్రాన, అవి ఎంత అభ్యంతరకరంగా లేదా సభ్యత లేనివిగా ఉన్నప్పటికీ ‘అశ్లీలత’ నేరం కిందకు రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 294 కింద ట్రయల్ కోర్టు తనకు విధించిన శిక్షను హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, “కేవలం తిట్టడం లేదా అసభ్య పదజాలం వాడడం మాత్రమే ఐపీసీ సెక్షన్ 294 కింద అశ్లీలత నేరంగా మారదు” అని పేర్కొంది. “ఒక మాటను అశ్లీల మైనదిగా పరిగణించాలంటే, అది కామ ప్రకోపాన్ని కలిగించేదిగా, కామవాంఛలను రేకెత్తించేదిగా ఉండాలి. దాన్ని వినే లేదా చూసే వారి మనస్సులను భ్రష్టు పట్టించేలా, చెడగొట్టేలా ఉండాలి. ఈ ప్రమాణాల ప్రకారం పరిశీలిస్తే, ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలన్నీ నిజమేనని పూర్తిగా అంగీకరించినప్పటికీ, ఆ మాటలను అశ్లీలమైనవిగా పరిగణించలేం. ఇలాంటి మాటలు ఎంత దూషణతో కూడినవి, వినడానికి వీలులేనివి లేదా సభ్యత లేనివి అయినప్పటికీ, ఇవి ఐపీసీ సెక్షన్ 294 (బీ) పరిధిలోకి రావు” అని సుప్రీంకోర్టు పేర్కొంది. “అసభ్య పదజాలం వాడకం వల్ల బహిరంగ ప్రదేశంలో ఇతరుల కు, ముఖ్యంగా ఫిర్యాదుదారునికి తీవ్ర అసౌకర్యం లేదా ఇబ్బంది కలిగిందని ఎక్కడా రుజువు కాలేదు. ఈ సెక్షన్ కు ఇది అత్యంత కీలకమైన నిబంధన. ఇది లేనప్పుడు, ఐపీసీ సెక్షన్ 294 (బీ) కింద నేరం జరిగినట్టు పరిగణించలేం” అని ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం
తమిళనాడులో 2017 ఆగస్టులో ఒక వ్యవసాయ భూమి గురించి వివాదం చెలరేగింది. ఆ సమయంలో పిటిషినర్‌కు, అతడి బావమరిదికి మధ్య వాగ్వాదం జరిగింది. రెండు రోజుల తర్వాత, అదే భూమి విషయమై మేనల్లుడితో పిటిషనర్ మళ్లీ గొడవ పడ్డాడు. దీనితో ఆయన బావమరిది జోక్యం చేసుకున్నాడు. కోపంతో పిటిషినర్ తన బావమరిదిని అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించాడు. దీనితో ట్రయల్ కోర్టు ఐపీసీ సెక్షన్ 294 (బీ) అశ్లీలత, సెక్షన్ 326 (తీవ్రంగా గాయపరచడం), 506 (ii) (క్రిమినల్ బెదిరింపు)తో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద దోషిగా తేల్చింది. దీనితో పిటిషనర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఆరోపణల నుంచి పిటిషినర్‌ ను నిర్దోషిగా విడుదల చేసింది. కానీ ఐపీసీ సెక్షన్ల కింద విధించిన శిక్షలను మాత్రం సమర్థించింది. ఈ నేపథ్యంలోనే సదరు పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పోక్సో దుర్వినియోగం
మరో కేసు విచారణ సందర్భంగా, పరస్పరం ప్రేమించుకున్న అమ్మాయి, అబ్బాయి కలిసి వెళ్లిపోకుండా రాష్ట్రం ఎలా అడ్డుకోగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యుక్త వయసులో పరస్పర సమ్మతితో ఏర్పడే ప్రేమ సంబంధాలపై పోక్సో చట్టం నిబంధనల్ని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, లైంగిక దోపిడీని అరికట్టేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ప్రతి ప్రేమ వ్యవ హారానికి వర్తింపజేయడం సరైనదేనా? అని ప్రశ్నించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం, యుక్త వయస్కుల గోప్యత హక్కులకు సంబంధించిన కేసును సుమోటోగా విచారణ చేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు అత్యంత సున్నితమైన దశ అని, ఈ వయసులో యువతలో సహజంగానే ఆకర్షణలు, భావోద్వేగాలు, ప్రేమ సంబం ధాలు ఏర్పడుతుంటాయని కోర్టు వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -