Monday, July 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రయివేటు యూనివ‌ర్సిటీలు ఎందుకు పెట్టారు?

ప్రయివేటు యూనివ‌ర్సిటీలు ఎందుకు పెట్టారు?

- Advertisement -

వాటి ల‌క్ష్యాలు ఏంటి? బోధ‌నా సిబ్బంది విద్యార్హ‌త‌లు..ఎంట్ర‌న్స్‌కు ఉన్న నిబంధ‌న‌లేమిటి?
ప్రయివేట్ యూనివ‌ర్సిటీల ఏర్పాటుపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ప్ర‌శ్న‌లు
పూర్తి వివ‌రాల‌తో అఫిడ‌విట్ స‌మ‌ర్పించాల‌ని ఆదేశం
స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో యూనివ‌ర్సిటీల్లో త‌నిఖీలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెద్ద సంఖ్య‌లో ఏర్పాట‌వుతున్న ప్రయివేటు యూనివ‌ర్సిటీల వెనుక ఉన్న అస‌లు ఉద్దేశాలు, వాటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ‌లు/ వ్య‌క్తుల అస‌లు ల‌క్ష్యాలు ఏమిటి..? ఆ యూనివ‌ర్సిటీల్లో బోధిస్తున్న వారికి ఉన్న విద్యార్హ‌త‌లు ఏమిటి అనే దానిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం దృష్టి సారించింది. అయేషా జైన్ వ‌ర్సెస్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా కేసు విచార‌ణ‌లో త‌న దృష్టికి వ‌చ్చిన అనేక ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు దేశ‌వ్యాప్తంగా ప్రయివేట్ యూనివ‌ర్సిటీల్లో త‌నిఖీల‌కు ఆదేశిం చింది. ప్రయివేట్ యూనివ‌ర్సిటీలు ఏక‌ప‌క్షం గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో అస‌లు వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలు మొద‌లు వాటిలో అందుతున్న విద్యా ప్ర‌మాణాల స్థాయి వ‌ర‌కు ప్ర‌తి అంశాన్ని క్షుణ్నంగా త‌నిఖీ చేసి పూర్తి వివ‌రాల‌తో అఫిడ‌విట్లు స‌మ‌ర్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రయివేటు యూనివ‌ర్సిటీల్లో త‌నిఖీల కోసం కాలేజీయేట్ ఎడ్యుకేష‌న్ చైర్మెన్ అధ్య‌క్ష‌త‌న ఒక క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీలో క‌న్వీన‌ర్‌గా తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి కార్య‌ద‌ర్శి, స‌భ్య క‌న్వీన‌ర్‌గా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌, స‌భ్యులుగా పాలమూరు యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ విద్యా క‌మిష‌న‌ర్ అసిస్టెంట్ డైరెక్టర్ (అకడమిక్-సి)ల‌ను నియ‌మించింది.

అవ‌స‌ర‌మైతే ఒక స‌బ్జెక్ట్ ఎక్స్‌ప‌ర్ట్‌ను నియ‌మించుకునే అవ‌ కాశాన్ని క‌మిటీకి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఈ క‌మిటీ రాష్ట్రంలోని ప్ర‌తి ప్రయివేటు యూని వ‌ర్సిటీని సంద‌ర్శించి క్షుణ్నంగా త‌నిఖీలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశించిన 9 అంశాల‌పై ఈ క‌మిటీ త‌నిఖీలు చేప‌డుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు త‌నిఖీ బృందం రాష్ట్రంలోని ప్రయివేట్ యూనివ‌ర్సిటీల్లో ఆయా అంశాల‌ను త‌నిఖీ చేసి ఆ వివ‌రాల‌తో స‌మ‌గ్ర అఫిడ‌విట్ రూపొందిస్తోంది. ఆ అఫిడ‌విట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించ‌నుంది. అఫిడ‌విట్ స‌మ‌ర్ప‌ణ అనంత‌రం సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నుంది. అలాగే త‌నిఖీ బృందం ఈ 9 అంశాల‌తో పాటు సంబంధిత ఇత‌ర అంశాల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి నివేదిక రూపొందించ‌నుంది.

​9 అంశాల‌పై సుప్రీం వివరణలు
​1. అస‌లు యూనివ‌ర్సిటీ ఎందుకు ఏర్పాటు చేశారు. దాని ఏర్పాటుకు కార‌ణాలు, ఉద్దేశాలు ఏమిటి? యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు ముందు సాధ్యాసాధ్యాల‌పై అధ్య‌య‌నం చేశారా? స్థాప‌న‌కు ముందు ఏమైనా విధాన‌ప‌ర‌మైన పరిశీలన (పాలసీ కన్సిడరేషన్) చేశారా? లేదా? యూనివ‌ర్సిటీకి రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమైనా భూమిని కేటాయించిందా? యూనివ‌ర్సిటీకి క‌ల్పించిన ఇత‌ర ప్ర‌యోజ‌నాలు, అందుకు విధించిన నిబంధ‌న‌లు, ష‌ర‌తులు ఏమిటి? యూనివ‌ర్సిటీని వాస్త‌వంగా నిర్వ‌హిస్తున్న సొసైటీ, సంస్థ‌, వ్య‌క్తి ధ్యేయం ఏమిటి?. యూనివ‌ర్సిటీ మేనేజ్‌మెంట్ క‌మిటీలో ఉన్న స‌భ్యులు ఎవ‌రు? ఆ స‌భ్యులను ఎలా ఎంపిక చేశారు. యూనివ‌ర్సిటీని వాస్త‌వంగా నిర్వ‌హిస్తున్న వ్య‌క్తి, మేనేజ్‌మెంట్ క‌మిటీలో స‌భ్యుల స‌మ‌గ్ర వివ‌రాలు. విద్యార్థులు యూనివ‌ర్సిటీలో చేర‌డానికి ఏ విధానం అవ‌లంభిస్తున్నారు. ఎంట్రెన్స్ కు సంబంధించిన ప్ర‌మాణాలు, నిబంధనలు, ఆ నిబంధ‌న‌లు చట్టానికి అనుగుణంగా ఉన్నాయా? లేదా?.. ఎంట్ర‌న్స్‌కు సంబంధించిన విధివిధానాల‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిందా? ధ్రువీక‌రించిందా?బోధ‌నా సిబ్బందిని (అక‌డ‌మిక్ స్టాఫ్‌) యూనివ‌ర్సిటీ ఎలా నియ‌మించింది. వారి ఎంపిక‌ను ఏ క‌మిటీ చేప‌ట్టింది. సిబ్బంది నియామ‌కం యూజీసీ నిబంధనలకు లోబ‌డే చేప‌ట్టారా? ఆ నియామ‌క ప్ర‌క్రియ‌ను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిందా..?

రాష్ట్రంలో ఇత‌ర విద్యా సంస్థ‌లు, యూనివ‌ర్సిటీల‌కు విధించిన నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను ఈ యూనివ‌ర్సిటీలు క‌చ్చితంగా పాటిస్తున్నాయ‌ని నిర్ధ‌ారించ‌డానికి ప్రభుత్వం త‌నిఖీ బృందాన్ని ఏర్పాటు చేసిందా? చేస్తే ఆ బృందం తనిఖీలు (ఇన్‌స్పెక్షన్లు) నిర్వహిస్తుందా? త‌ర‌చూ త‌నిఖీలు చేస్తున్నదా? నిబంధనల అమలును త‌నిఖీ బృందం ప‌ర్య‌వేక్షిస్తుందా? ఏవైనా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారా? నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఏమైనా చ‌ర్య‌లు తీసుకున్నారా? ప్రభుత్వం తరఫు నుంచి ఏవైనా మినహాయింపులు ఇచ్చారా? ‘లాభాపేక్ష లేని, నష్టం లేని’ (నో ప్రాఫిట్, నో లాస్) ప్రాతిపదికన పని చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించుకున్న యూనివ‌ర్సిటీలు నిజంగా అలానే ప‌ని చేస్తున్నాయా? ప్రభుత్వం దానిని ఏ అధికారంతో అనుమ‌తించింది. యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేసిన వారు, ఆ వ్యక్తి కుటుంబ స‌భ్యుల‌కు చెల్లించే వేత‌నాలు, ఇత‌ర ఖ‌ర్చులు, సంపాదించిన ఆస్తులతో సహా ఇతర అంశాల‌కు యూనివ‌ర్సిటీల‌ నిధులు మళ్లించ‌లేద‌ని ఎలా నిర్ధారించారు? ఆయా యూనివ‌ర్సిటీల ఖాతాలను ఆడిట్ చేశారా? నిధుల మళ్లింపుపై ఏవైనా పరిశీలన చేశారా?

యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేసిన వ్య‌క్తి, ఆయ‌న కుటుంబ సభ్యులకు చేసిన‌ చెల్లింపులను నిశితంగా పరిశీలించారా? యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేసిన వారు, ఆయ‌న కుటుంబ సభ్యులు సంపాదించిన ఆస్తులను పరిశీలించారా? ఎక్క‌డైనా నిబంధనల ఉల్లంఘనల‌ను గుర్తించారా? గుర్తిస్తే తీసుకున్న చ‌ర్య‌లు ఏమిటి? విద్యార్థులతో పాటు బోధ‌నా సిబ్బంది ఫిర్యాదుల పరిష్కారానికి ఏదైనా వ్య‌వ‌స్థ స‌ద‌రు యూనివ‌ర్సిటీలో ఉందా? ఉంటే అవి ప‌ని చేస్తున్నాయా? ఫిర్యాదుల పరిష్కార కమిటీల కూర్పు ఎలా ఉంది. అప్పీలేట్ చేసుకునే అవ‌కాశం ఉందా? ఇప్ప‌టి వ‌కు ఏవైనా ఫిర్యాదులు అందాయా? అందితే వాటిని పరిష్కరించారా.? యూనివ‌ర్సిటీలు చట్టప్రకారం నిర్దేశించిన కనీస వేతనాలను అక‌డ‌మిక్ స్టాఫ్‌కు చెల్లిస్తున్నాయా? యూజీసీ నిబంధనల అమలును ధ్రువీక‌రించారా? సిబ్బంది వేత‌నాల రికార్డులను పరిశీలించారా? ఈ క్ర‌మంలో ఎక్క‌డైనా నిబంధనల ఉల్లంఘన గుర్తించారా? అలా గుర్తిస్తే ఏమైనా చర్య తీసుకున్నారా?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -