Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల సొంతింటి కలను సాకారం చేస్తాం

పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం

- Advertisement -

ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం
క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్లకు సోమవారం శ్రీకారం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పేద వారందరి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇండ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందనీ, ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా, ఇప్పటికే సుమారు రెండు లక్షల ఇండ్లు పూర్తై లక్షలాది కుటుంబాలు గృహ ప్రవేశాలు చేశాయని, మిగిలిన ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. రెండో విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిం చామని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంతింటి కలను కూడా నిజం చేయబోతోందని మంత్రి చెప్పారు. క్యూర్ పరిధిలో లక్ష ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తో కలిసి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు.పేదల ఇండ్ల కోసం నగరంలో కోట్ల రూపాయల విలువైన అత్యంత కీలక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించిందని, ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు స్థలాలను సేకరించినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరానికి దూరంగా కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబాల జీవనోపాధికి, పిల్లల చదువులకు, ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో బహుళ అంతస్తుల (పది అంతస్తుల వరకు) భవనాల నిర్మాణం చేపట్టి, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి
ప్రతి నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తున్న ఈ పథకంలో ఆ నియోజకవర్గ ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇండ్లు కలిపి మొత్తం 3.50 లక్షల కొత్త ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, గతేడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకుపైగా పేద కుటుంబాల జీవితాల్లో సొంతింటి వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -