Monday, July 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'అంతులేని' అన్యాయం

‘అంతులేని’ అన్యాయం

- Advertisement -

తూకాల్లో ‘తాలు’ దోపిడీ.. ట్రక్‌షీట్లలో బస్తాల కోత..
రైతుల ఖాతాలకు గండి కొట్టి..మిల్లర్లతో చేతులు కలిపిన నిర్వాహకులు
మూన్నెళ్లుగా నిలిచిన రూ.లక్షల నిధులు..ఇప్పుడేమో స్కాముల సాకు..

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
​ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని ఆశించిన అన్నదాతలకు నూకలమర్రి పీఎస్‌సీఎస్‌ నిర్వాహకులు కోలుకోలేని దెబ్బకొట్టారు. అమాయక, ప్రశ్నించలేని రైతులనే టార్గెట్‌గా చేసుకుని పెద్దఎత్తున ధాన్యం దోపిడీకి తెరలేపారు. తూకం వేసేటప్పుడు ఒకలా.. ట్రక్‌షీట్లలో నమోదు చేసేటప్పుడు మరొకలా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొట్టారు. పైగా ఇటీవల జిల్లాలో వెలుగుచూసిన ధాన్యం కుంభకోణంతో ఈ బాధితులకు ముడిపెడుతూ నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ​నిబంధనల ప్రకారం బస్తాలో 40.600 కిలోల ధాన్యం మాత్రమే తూకం వేయాలి. నూకలమర్రిలో తాలు, తరుగు పేరిట ఒక్కో బస్తాకు 43 నుంచి 45 కిలోల వరకు.. బస్తాకు దాదాపు 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని తూకం వేశారు. అక్కడితో ఆగని అక్రమార్కుల దాహం.. మిల్లులకు ధాన్యం పంపిన తర్వాత అసలు రంగు బయటపెట్టింది.

సుమారు 300 మంది రైతులు విక్రయించిన 28వేల క్వింటాళ్ల ధాన్యంలో లారీ లోడ్‌ సహా అదనపు ధాన్యపు సొమ్మును కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నొక్కేసి, ట్రక్‌షీట్లలో మాత్రం భారీగా కోత విధించారు. ఒక్కో రైతు విక్రయించిన వడ్లలో 5 నుంచి 15 బస్తాల వరకు కోత పెడుతూ తక్కువ ధాన్యాన్ని నమోదు చేశారు. ఇందులో గ్రామంలోని 10 బస్తాలకు పైగా కోత పడిన వారిలో గుగులోతు బలరామ్‌ (871 బస్తాలు అమ్మితే 24 బస్తాలు కోత), కర్గి రవి, గుగులోతు ఈర్యనాయక్‌, బెలుముల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఇక 5 నుంచి 10 బస్తాల లోపు కోత పడిన వారు సోమినేని శ్రీనివాస్‌, ఉప్పుల తిరుపతి, గుగులోతు గంగారాం, మేడుదుల అంజవ్వ, పిట్టల శంకరవ్వ, ఉప్పుల రఘు ఇలా పది మందికిపైగానే ఉన్నారు. ఇతర చిన్న, సన్నకారు రైతులందరి ధాన్యం బస్తాల్లో 3 నుంచి 5 బస్తాల చొప్పున కోత విధించారు.

​పైసల్లేక రైతుల అరిగోస!
​ఈ గ్రామంలో దాదాపు 17 మంది రైతుల ధాన్యం డబ్బులు మూడు నెలలుగా ఖాతాల్లో జమ కాలేదు. ప్రశ్నించిన రైతులపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తూ వారి పంట వివరాలను ఇటీవల జరిగిన ధాన్యం కుంభకోణాల (స్కామ్‌) పరిధిలోకి నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. బాధిత రైతు లను ‘నవతెలంగాణ’ కదిలించగా ఆవేదన వెలిబుచ్చారు. ‘నేను మూడు నెలల కిందట సొసైటీలో 476 బస్తాల ధాన్యం విక్ర యించాను. లెక్కల్లో 464 మాత్రమే చూపు తున్నారు. నాకు రూ. 4.50 లక్షలు రావాల్సి ఉంది. అడిగితే అపరెల్‌ పార్క్‌ గోదాము ఇష్యూలో ఉందని చెప్తున్నారు. ఎవరో చేసిన అవినీతికి నా డబ్బులు ఆపేయడమేంటి? బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నాను. మా ధాన్యం ఏ గ్రేడో, బీ గ్రేడో చెప్పలేదు, క్వింటాల్‌ ధరకు ఎంత లెక్కించారో అసలే చెప్పడం లేదు’ అంటూ లాల బాలరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు గడీల తిరుపతిని కదిలించగా.. ‘మా వడ్లు ఎల్లారెడ్డి పేటకు లారీల్లో పోయినవి. ఆ లారీలో ఏడు గురు రైతుల వడ్లు పోతే.. ఆరుగురికి పైసలు పడ్డాయి. నావి మాత్రమే పడలేదు. ప్రతి లారీ లోనూ ఒకరిద్దరి రైతుల డబ్బులు ఇలాగే ఆపేశారు. మాకు చెప్ప కుండా బస్తాల్లో కోతలు పెడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా నూకల మర్రిలో ఏ రైతును కదిలించినా తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడు తున్నారు. ఈ నెల 15న ఈ గ్రామ రైతు లంతా కలెక్టరేట్‌కు తరలివెళ్లి సివిల్‌ సప్లై అధి కారులకు మొర పెట్టుకున్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్పటికీ రైతుల ఆందోళన మాత్రం తగ్గలేదు.

​వ్యవస్థీకృత ధాన్యం మాఫియా!
జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సింగిల్‌ విండో చైర్మెన్లు, బుక్‌ కీపర్లు, ట్యాబ్‌ ఎంట్రీ ఆపరేటర్లు వ్యవస్థీ కృతంగా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు రైతుల ధాన్యంలో ‘తరుగు’ పేరిట కోత పెట్టి, ఆ డబ్బుతో ఏకంగా రెండంతస్తుల భవనం నిర్మించాడు. మిల్లర్లు అతనికి రహస్యంగా కమీషన్లు ఇస్తూ ఈ దందా నడిపించారు. పక్కనే ఉన్న వీర్నపల్లి మండలంలోని ఓ గ్రామ కొనుగోలు కేంద్ర నిర్వాహకురాలు రైతుల వడ్ల బస్తాలను తన పేరిట ట్యాబ్‌ ఎంట్రీ చేసుకుని రూ. 16 లక్షలు దారి మళ్లించింది. ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఆ డబ్బు రికవరీ చేసి ఆమెను బాధ్యతల నుంచి తప్పించారు. ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమే. ఇలా ప్రతి సొసైటీలోనూ అప్పనంగా రైతులను శ్రమను దోచుకుంటున్న తీరు వేళ్లూనుకుపోయింది. గత నెల 20న సిరిసిల్ల టౌన్‌ పోలీసులు రూ.91 లక్షల ధాన్యాని దారి మళ్లించిన కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విచారణ సాగుతుంది.

రాజన్నసిరిసిల్లలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల వివరాలు
మొత్తం కొనుగోలు కేంద్రాలు – 236
కొనుగోలు చేసిన ధాన్యం – 3,66,963 మెట్రిక్‌టన్నులు
కొన్న ధాన్యం విలువ – రూ. 876.57 కోట్లు
ధాన్యం అమ్మిన రైతులు – 46,812
రైతుల ఖాతాల్లో జమయిన డబ్బు – రూ. 753.28 కోట్లు
డబ్బు పొందిన రైతులు – 45,225
ఇంకా లబ్ధిపొందని మిగిలిన రైతులు – 1,587 మంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -