పది రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలి
ఈ నెల 30న పూర్తి స్థాయిలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తాం : సర్ పై జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హదరాబాద్
సర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పది రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పొడిగింపును ఒక అవకాశంగా తీసుకోవాలని సూచించారు. సర్ పై ప్రతి ఒక్కరు సీరియస్ గా దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ గాంధీభవన్ కు వస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. అన్ని విషయాలపై ఈ నెల 30న పూర్తి స్థాయిలో మళ్లీ సమీక్ష నిర్వహించి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సర్ పై నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 119 నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్‌పై 489 సమావేశాలు జరిగాయని సీఎం తెలిపారు. బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలని సూచించారు. చైర్మెన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని ఆశావహులను కోరారు. అలాంటి వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని పనిచేయడం లేదని ఆయన తప్పుపట్టా రు. సోమవారం పది మంది ఇంచార్జి మంత్రు లు అన్ని జిల్లాల్లో సర్ పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని సీఎం వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ ఎంపీలు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలన్నారు. ఇంచార్జిలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పార్టీ పరంగా సర్ ఇంచార్జిలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, చైర్మెన్లు బీఎల్‌ఓల రిపోర్టుల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను ఎక్కువగా పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బీఎల్‌ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పార్టీ పరంగా పని చేస్తున్న బీఎల్‌ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలనీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మెన్లు, సర్ కోసం నియమించిన పార్టీ ఇంచార్జిలు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని తేల్చి చెప్పారు.
బీఎల్‌ఏ, బీఎల్‌ఓ రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలనీ, సర్ ను ఇంచార్జి మంత్రులు పూర్తిగా పర్యవేక్షించాలనీ, అన్నింటికీ వారిదే బాధ్యత అని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జిలను సమన్వయం చేయాలని సూచించారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, నియోజకవర్గ ఇంచార్జిలు, సర్ కో ఆర్డినెటర్స్ తదితరులు పాల్గొన్నారు.



