భ‌ద్ర‌త మా హ‌క్కు

Security is our rightమార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి మహిళని భావోద్వేగానికి గురి చేసే రోజు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాడు జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ కార్మిక ఉద్యమంలోనే మార్చి 8 పునాదులు ఉన్నాయి. మెరుగైన వేతనాల కోసం, పని ప్రదేశాల్లో భద్రత కోసం, శాంతి కోసం మహిళలు 100 ఏండ్లకు పైగా పోరాడుతూ వస్తున్నారు. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో అనేక హక్కులు సాధించారు. మరికొన్ని చోట్ల ఉన్న హక్కులు కోల్పోతున్నారు. కాబట్టి ఇదేదో ఉత్సవాలు చేసుకునే రోజు కాదు. ఇంటాబయట గౌరవప్రదమైన జీవితం కోసం సాగే పోరాటానికి మార్చి 8 ఒక సంకేతం.
1908లో న్యూయార్క్‌ నగరంలో వేల మంది మహిళలు కనీస వేతనాల కోసం, పని ప్రదేశాల్లో భద్రత కోసం సమ్మె చేశారు. ఈ సమ్మె చేసిన మహిళల్లో అప్పటికే ఐరోపా దేశాల నుండి అమెరికాకు వలసపోయి పని చేస్తున్న కార్మిక స్త్రీలు ఉన్నారు. వాళ్ళల్లో అనేక భాషలు మాట్లాడే వారున్నారు. వారి ప్రాంతాలు, జాతులు, భాషలు మర్చిపోయి అందరూ ఏకమై వేలాదిమంది మహిళలు సమ్మె చేశారు. ఇది అమెరికా కార్మిక ఉద్యమాన్ని ఉత్తేజపరిచింది. అప్పటి అమెరికన్‌ సోషలిస్టులు ఒక అడుగు ముందుకు వేసి 1909లో ఫిబ్రవరి నెలలో ఆఖరి ఆదివారం జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. రొట్టె కోసం, శాంతి కోసం నినాదాలు ఇచ్చారు. బతకటానికి సరైన పోషకాహారం కావాలి. ఎటువంటి భయాలు లేని భద్రతతో కూడిన సమాజం కావాలి. అందుకే రొట్టె- శాంతి అనే నినాదాలతో అమెరికా మహిళలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

దుర్భరమైన జీవితాల నుండి పుట్టిందే…

ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఐరోపా, అమెరికా ఖండాల్లో, మన దేశంలో కూడా లక్షల సంఖ్యలో మహిళలు బట్టల మిల్లులోను, తేయాకు, కాఫీ తోటల్లోనూ, పొగాకు పరిశ్రమల్లోనూ పనిచేసేవారు. వీరి జీవితాలు చాలా దుర్భరం. సరైన వేతనాలు లేవు. భద్రత ఉండేది కాదు. ఫ్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు జరిగేవి. న్యూయార్క్‌ నగరంలోని ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో సుమారు 150 మంది మహిళలు కాలి బూడిద అయిపోయారు. ఈ పరిస్థితులన్నిటిని అంతర్జాతీయ కార్మిక సంస్థ పరిశీలిస్తూ వచ్చింది. క్లారా జెట్కిన్‌, రోజా లగ్జంబర్గ్‌ వంటి నాయకులు అంతర్జాతీయ కార్మిక సభల్లో చర్చించారు. 1910 సెప్టెంబర్‌లో డెన్మార్క్‌ లోని కోపెన్‌హెగెన్‌ నగరంలో 17 దేశాల నుండి వంద మందికి పైగా ప్రతినిధులు సమావేశం అయ్యి, అన్ని దేశాల్లోనూ మహిళల కోర్కెల దినం జరపాలని నిర్ణయించారు. అప్పటినుండి అనగా 1911 నుండి అన్ని దేశాల్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మహిళల కోర్కెల దినం జరుపుతున్నారు. కనీస వేతనాలు, పని ప్రదేశాల్లో భద్రత, ప్రపంచ శాంతి ప్రధానమైన డిమాండ్స్‌.

మార్చి 8కి ప్రముఖ పాత్ర

మార్చి 8 కి మరో ప్రాముఖ్యత ఉన్నది. అక్టోబర్‌ విప్లవం ప్రాముఖ్యతను మన అందరం తెలుసుకోవాలి. రష్యన్‌ విప్లవాన్నే అక్టోబర్‌ మహా విప్లవం అని కూడా అంటారు. అందరికీ తెలిసిందే కదా. చక్రవర్తి పరిపాలన అంతమై కార్మిక కర్షక రాజ్యం ఏర్పడటంలో మార్చి 8కి ప్రముఖ పాత్ర ఉన్నది. రష్యన్‌ మహిళలు 1917లో మార్చి 8 జరపాలనుకున్నారు. పాత క్యాలెండర్‌ ప్రకారం ఫిబ్రవరి 28, కొత్త క్యాలెండర్‌ ప్రకారం మార్చి 8 రోజున లక్షల సంఖ్యలో మహిళలు వీధిలోకి వచ్చారు. వారి నినాదం రొట్టె, శాంతి. అప్పటికే రష్యాను జార్‌ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు.

అంతమైన జార్‌ చక్రవర్తి పరిపాలన

మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. లక్షల సంఖ్యలో గ్రామీణ రైతు యువకులు బలవంతంగా యద్ధరంగంలోకి పంపబడ్డారు. చనిపోయిన యువకుల మతదేహాలు, కాళ్లు చేతులు విరిగిన సైనికులు గ్రామాలకు చేరుతున్నారు. ఈ దుస్థితిలో యుద్ధమేఘాల వల్ల పనులు కోల్పోయి పేదరికంలో మగ్గుతున్న ప్రజల ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. పిల్లలకు తిండి పెట్టుకోలేని దుస్థితిలో మహిళలు ఉన్నారు. ఈ స్థితిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు లక్షల సంఖ్యలో మహిళలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వారిలో బేకరీలో పనిచేసేవారు, లాండ్రీల్లో పని చేసే వారితో సహా రోడ్లపైకి వచ్చారు. రొట్టె-శాంతి వారి నినాదం. సైనికులకు కూడా వారు పిలుపిచ్చారు. ‘సైనికులారా మాతో చేతులు కలపండి, మీ తుపాకులు మావైపు కాదు, పరిపాలకుల వైపు ఎక్కుపెట్టండి’ అని ఉద్భోదించారు.. యుద్ధాన్ని విరమించమని విజ్ఞప్తి చేశారు. ఆ మహిళలు చేసిన పోరాటం వల్ల జార్‌ చక్రవర్తి పరిపాలన అంతమయ్యింది. వందల ఏండ్ల జార్‌ చక్రవర్తి పరిపాలన అంతమైన రోజు. ఇది 1917 అక్టోబర్‌ విప్లవానికి నాంది పలికింది.

మన దేశ మహిళల పాత్ర

మనదేశంలో శ్రామిక వర్గ మహిళలు, రైతాంగ స్త్రీలు కూడా చారిత్రాత్మక పోరాటాలు సాగించారు. చరిత్రలో వారి పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయే పద్ధతుల్లో పనిచేశారు. కేరళ నుండి అస్సాం వరకు ఉన్న కాఫీ, తేయాకు తోటల్లో లక్షలాది మహిళా కార్మికులు గాని, బొంబాయి నుండి మద్రాసు వరకు బట్టలు మిల్లు కార్మికులు, పొగాకు కార్మికులు గాని లక్షల సంఖ్యలో ఉధతమైన సమ్మెలు చేశారు. ఇకపోతే ఆంధ్ర ప్రాంతంలో జమీందారు వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం మరుపురానివి. ఈ పోరాటంలో మహిళల తెగింపు సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది. శ్రీకాకుళం జిల్లా మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో నాయకత్వం వహించి ప్రాణాలు కోల్పోయిన వీర వనిత గున్నమ్మ, చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన బావిరెడ్డి వియ్యమ్మ, తెలంగాణలో రైతాంగ పోరాటానికి అంకురార్పణ చేసిన వీరనారి ఐలమ్మ మన కళ్ళెదుటే ఉన్నారు కదా.. ఆ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచారి విముక్తి కోసం రైతు, వ్యవసాయ కార్మిక మహిళలు బానిసత్వానికి వ్యతిరేకంగా, కూలిరేట్ల పెంపు కోసం చాలా గొప్ప త్యాగాలు చేశారు. వారిలో అగ్ర వర్గాల స్త్రీల నుండి దళిత, ఆదివాసి మహిళల వరకు అనేకమంది ఉన్నారు. ఆ పోరాటం స్త్రీ సమస్యను కూడా ముందుకు తెచ్చింది. కులాంతర, మతాంతర వివాహాలు అనేకం జరిగాయి. వితంతు పునర్వివాహాలు జరిగాయి. ఇది మన చరిత్ర.

మీకు తెలుసా?

ఇక ఇప్పటి పరిస్థితికి వద్దాం. మన దేశంలో మహిళల జీవితాలు పరిశీలిద్దాం. మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రభుత్వాల చేతలు గడప దాటడం లేదు. మనదేశం ఆకలికేకల్లో ముందున్నది. ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌) ప్రపంచంలోని 127 దేశాలలో 105వ స్థానంలో ఉన్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. జనాభాలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం. విశ్వగురు పరిపాలనలో ఉన్నాం. కానీ ప్రజలకు కనీసం తిండి కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన బాగా పేరొందిన పథకం. ఈ పథకం కింద వాళ్ల కన్నీళ్లు తుడవడానికి అన్నట్లు 81 కోట్ల మందికి పైగా నెలకి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తున్నారట. అంటే ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యం తీసుకుంటే తప్ప బతకలేని స్థితిలో కోట్లాది ప్రజలు ఉన్నారన్నమాట. ప్రజల్లో అంత ఆరోగ్యం ఉంటే పుచ్చు పట్టిన పురుగు పట్టిన, ఉడికిస్తే ముద్దయిపోయే బియ్యానికి కూడా ఈ దేశంలో కోట్ల ప్రజలు ఆశపడుతున్నారంటే పరిస్థితి అర్థం అవుతుంది. అయితే ఆదాయానికి కూడా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేస్తుంది. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన దానికన్నా 8394 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 2050 కోట్లు తక్కువ కేటాయించారు. ద్రవ్యోల్బణం 7, 8 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కనీసం పోషకాహారం కూడా తినే స్థితిలో జనం లేరు. చికెన్‌, మటన్లు అలా ఉంచండి. పప్పు దినుసులు, నూనె, ఆఖరికి వెల్లుల్లి, ఉల్లిగడ్డ కూడా రేట్లు చుక్కలు అందుతున్నాయి. మనకన్నా చిన్నాచితకా దేశాలు స్త్రీలు, పిల్లలకి సరైన పోషకాహారం అందించడంలో ముందున్నాయి. వాళ్ళ కన్నా మనం వెనకబడి ఉన్నాం. బాధగా లేదూ… నూటికి 35 మంది పిల్లలు తిండి లేక ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు. మరోవైపు స్త్రీలు, పిల్లల్లో పోషకాహార లోపం ఊహించనంతగా ఉంది.

చదువులెట్లున్నాయో చూద్దాం…

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల బడులు ఈ రెండు మూడేండ్ల కాలంలో మూతపడ్డాయి. మూడో క్లాస్‌ చదవాలంటే ఊరికి రెండు కిలోమీటర్ల పైనున్న హైస్కూల్‌కు పోవాలి. చిన్నపిల్లలు ఎట్లా నడుస్తారో, ఆడపిల్లలకి భద్రత ఏమిటో అని ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. పేరుకు మాత్రం భేటీ పడావో – బేటి బచావో. 2022-23 లెక్కల ప్రకారం దేశంలో పదివేలకు పైగా స్కూళ్ళు మూతపడ్డాయని లెక్కలు చెబుతున్నాయి. పిల్లల చదువులు ఇలా ఏడుస్తున్నాయి..! ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు పెంచకపోగా మొక్కుబడిగా మొత్తం బడ్జెట్లో 2.5% కేటాయించింది. కనీసం మొత్తం బడ్జెట్లో 6% అయినా కేటాయించాలని నిపుణులు చెప్తున్నారు.

ఆరోగ్యం విషయంలో…

మన ఊర్లో లేదా బస్తీలో ఉన్న ఆశా వర్కర్‌ తప్పితే, అంగన్వాడీ అక్కలు, ఏఎన్‌ఎంలు… ఇవేవీ కాకపోతే మంత్రగత్తెలు. అందుబాటులో ఆసుపత్రి ఉండదు. గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉండవు. మోడీ గారి ఉపన్యాసాలు, నిర్మల అక్కయ్య గారి బడ్జెట్‌ ఉపన్యాసాలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి మనమేమో తలరాత అనుకుంటూ సరిపెట్టుకుంటున్నాం. గత ఏడాది 2.26% బడ్జెట్లో కేటాయింపులు ఉంటే ఈ ఏడాదికి 2.05 శాతానికి పడిపోయింది. కొండనాలుక్కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉంది. రోగులకు సరిపడా డాక్టర్లు గాని, నర్సులు గాని ఉండరు. ప్రభుత్వం వారి పోస్టుల్లో ఖాళీలు నింపదు. ఆఖరికి ఎక్స్‌రే మిషన్లు కూడా పనిచేయవు. రక్త పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు ఉండవు. వైద్యం వికటిస్తే అందుకు డాక్టర్లు, నర్సులదే బాధ్యత అన్నట్లుగా ఉంటుంది. అనేక సందర్భాల్లో రోగుల తాలూకు బంధువుల ఆగ్రహావేశాలకు నర్సులు, డాక్టర్లు బలి అవుతుంటారు. కనీసం ఆరోగ్య రంగానికి స్థూల జాతీయోత్పత్తిలో 2.5% అయినా కేటాయించాలని నిపుణులు చెప్తున్నారు. ప్రసూతి సౌకర్యాలు అందుబాటులో లేక తల్లి పిల్లల మరణాల సంఖ్యను మనం నిత్యం చూస్తున్నాం కదా.. అంటే తల్లి పిల్లల ఆరోగ్యం కోసం సరైన చర్యలే లేవు. సర్వసాధారణంగా ప్రజలకు వచ్చే అంటూ వ్యాధులు, పుట్టు క్షయ వంటి వ్యాధుల నిరోధానికే జాతీయ ఆరోగ్య విధానాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. మరి బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యం. ప్రైవేట్‌ రంగానికి మాత్రం నిధులు కట్టబెడుతున్నారు. పెద్దపీట వేస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగంలో 100% విదేశస్తులు పెట్టుబడులు పెట్టవచ్చని గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. అది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో, అంటే మనకు పైకి కనిపించే ఆరోగ్య శ్రీ వగైరాలు ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు వెళ్తాయి కానీ ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు ఉపయోగపడేది శూన్యం. ప్రభుత్వాసుపత్రి నిర్వహణను మెరుగుపరిచి ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచడం మర్చిపోయారు.

ఉద్యోగ కల్పన ప్రస్తావనే లేదు

ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఉద్యోగాల కల్పనకు ఎటువంటి ప్రస్తావన లేదు. సరైన పని దొరక్క చదువుకున్న ఆడపిల్లలు కూడా ఇళ్లల్లో వృద్ధులను చూడడానికో, వంట చేయడానికి, కేర్‌ టేకర్లుగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. వంద రోజులు పని కల్పిస్తానన్న ప్రభుత్వం 42 రోజులకు మించి పని ఇవ్వడం లేదు. అక్కడ కూడా రూ.600 రూపాయలు వేతనం కావాలని డిమాండ్‌ చేస్తుండగా రు.250 రూపాయలు కూడా ఎక్కడా గిట్టుబాటు కావడం లేదు. పట్టణాల్లో పట్టణ ఉపాధి గ్యారెంటీ పథకం కావాలని చేస్తున్న డిమాండ్‌ గురించి ప్రస్తావన లేదు.

అప్పుల్లో కూరుకుపోయి

కుటుంబాలను పోషించుకోలేని స్త్రీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తాగుబోతు భర్తల బాధ్యతారాహిత్యం పుండుమీద కారం చల్లినట్టుగా ఉన్నది. ఇటీవల ఐద్వా చేసిన సర్వేలో మైక్రో ఫైనాన్స్‌ అప్పుల్లో కూరుకుపోయిన మహిళల గాధలు వర్ణనాతీతం. సుమారు 60శాతం మహిళలు మైక్రో ఫైనాన్స్‌ అప్పుల్లో కూరుకుపోయారని అనధికార సర్వేలు చెబుతున్నాయి. వారం వడ్డీలు, నెల వడ్డీలు వసూలు చేస్తున్నారు. 24శాతం నుండి 80శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు రు.2/- నుండి రు.8/- వరకూ వడ్డీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అదానీ వంటి కోటీశ్వరులకు 20లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టింది. కానీ సాధారణ మహిళలకు వడ్డీలేని రుణాలు, కనీసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు.

విపరీత పరిస్థితి…

ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నా తమ జీవితాల్లో వెలుగుల కోసం పోరాడవలసిన మహిళలు కుంభమేళాలు, తీర్థయాత్రలతోనే బొందితో కైలాసానికి పోవచ్చు అనుకుంటున్నారు. ఇది ఒక విపరీత పరిస్థితి. ప్రజల్లో బతుకుపట్ల, తోటి ప్రజల పట్ల విశ్వాసం, నమ్మకం సడలుతోందా..? పోరాడితే సాధించగలం అన్న నమ్మకం విశ్వాసాలు లేకనేనా ఈ పరిస్థితి. ఇహలోకంలో ఎట్లాగు సుఖపడలేం… పైలోకంలోనైనా సుఖపడదామని అనుకుంటున్నారా..? ఈ పరిస్థితి అభివద్ధి నిరోధక భావాలకు చక్కని భూమిక. ఏ గడ్డమీదైతే ప్రజలు దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారో ఆ గడ్డ మీదే పరువు హత్యల పేరుతో కులదురహంకార హత్యలకు పాల్పడుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల్ని చంపుతున్నారు, విడదీస్తున్నారు. ఇది విపరీత కాలం అనక ఏమనాలి..? ఏమన్నా అంటే ‘మా కులం, మా మతం, మా పరువు’ అని అనుకుంటున్నారు. కేంద్రంలో ఉన్న పాలకులు పరోక్షంగా ఈ ధోరణికి వంతపాడుతున్నారు. ప్రజల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించాల్సిన ప్రభుత్వాలు ప్రజల మనసుల్లో మూఢనమ్మకాలు, కులం, మతం పిచ్చిని నింపుతున్నారు.

పోరాటమే శరణ్యం

మనం మూఢత్వంలో కూరుకునిపోయి ఉంటే మార్చి 8 లేదు, మన హక్కులు లేవు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు – మన ముందు తరం నాయకులు పోరాటమే శరణ్యం అనుకున్నారు. అందుకే కనీస వేతనాల కోసం, భద్రత కోసం పోరాడారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోరాటమనే అంకుశంతో మదమెక్కిన ఏనుగు లాంటి ప్రభుత్వాలను లొంగదీయాలని మనకు దిశా నిర్దేశం చేశారు. ఆ పిలుపుని సార్ధకం చేద్దాం.

ఇదే మార్చి 8 సందేశం

ఇటీవలే నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 10 వరకు మహిళల భద్రత కోసం, హింసలేని సమాజం కోసం చాలా సభలు జరిపాం. మహిళల హక్కులు మానవ హక్కులే అని నినాదాలు చేశాం. ఈ మార్చి 8 సందర్భంగా కూడా అదే వారసత్వాన్ని కొనసాగించాలి. గౌరవంగా జీవించే హక్కు మనది కావాలి. భద్రత, గౌరవప్రదమైన ఉపాధి – ఉద్యోగం, పోషకాహారం, అప్పుల ఊబి నుండి బయటపడటం… ఇవి మన హక్కు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టాలి. ఈ హక్కులు సాధించాలంటే మనకెందుకులే అనే మహిళల్ని మనం చైతన్యపరచాలి. కుంభమేళాలు, తీర్థయాత్రలకు పోయి గంగలో మునిగితే పోయేది సర్వపాపాలు కాదు. వచ్చేవి అంటు రోగాలు అని అర్థం చేసుకోవాలి. మనం కాస్త నోరు విప్పి మాట్లాడి, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసి మనం ఏంటో, మన అవసరాలు ఏంటో మన హక్కులు ఏంటో మనం గమనించాలి. భద్రత మా హక్కు – ఉపాధి మా హక్కు – తిండి మా హక్కు – వడ్డీ లేని రుణం మా హక్కు. ఇదే మార్చి 8 సందేశం కావాలి.
– పుణ్యవతి

Spread the love