వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తన మేళా

నవతెలంగాణ – కరీంనగర్‌
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి సంవత్సరం మే 24న రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానాలలో విత్తన మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ సైంటిస్ట్‌ హెడ్‌ డాక్టర్‌ జి.మంజులత తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో విత్తన మేళా, ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మంజులత మాట్లాడుతూ.. పంటలో ఎక్కువ దిగుబడి నాణ్యమైన విత్తనంతోనే సాధ్యమవుతుందన్నారు. కరీంనగర్‌ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఎండు తెగులుని తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చే మొక్కజొన్న సంకర రకమైన కరీంనగర్‌ మక్క 1, తక్కువ కాలపరిమితి కలిగి మంచి దిగుబడినిచ్చే సంకర రకమైన కరీంనగర్‌ మక్కతో పాటు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైన కందిలో అధిక దిగుబడిని ఇచ్చే హనుమ (టీడీఆర్‌జీ 4) రకాన్ని రైతులకు విక్రయించడానికి అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. రైతులందరూ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా భూసార పరీక్ష, పచ్చిరొట్ట పంటలు, అంతర పంటలు, వరికి ముందు పెసర సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందాలని సూచించారు. ముఖ్య అతిథి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌ మాట్లాడుతూ.. రైతులందరూ ఈ విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే వ్యవసాయ శాఖ వారు అందుబాటులో ఉంచిన పచ్చిరొట్ట, జనుము, జీలుగ విత్తనాలు తీసుకొని సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన వరి రకాలలో జగిత్యాల వరి 1 (జేజీఎల్‌ 24423) గత మాసంలో కురిసిన వడగండ్లను తట్టుకుని గింజ రాలకుండా మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.మదన్‌ మోహన్‌ రెడ్డి అధిక సాంద్రత ప్రత్తి సాగులో మెళకువలు, సాగు విధానం గురించి వివరించారు. అనంతరం శాస్త్రవేత్తలు డాక్టర్‌ డి.శ్రావణి, డాక్టర్‌ జి.ఉషారాణి వానకాలంలో సాగు చేసే వివిధ పంటలకి సంబంధించి అనువైన రకాలు, వాటి లక్షణాలను వివరిస్తూ పంటలను విత్తుకునే సమయాన్ని కూడా వివారించారు. అనంతరం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ భస్కర్‌, డాక్టర్‌ పి.మధుకర్‌ రావు, డాక్టర్‌ ఎం.రాజేంద్ర ప్రసాద్‌, విత్తన దృవీకరణ ఆఫీసర్‌ నవీన్‌రెడ్డి మాట్లాడారు. అలాగే తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్‌ ప్రస్తుతం సంస్థలో అందుబాటులో ఉన్న విత్తనాలు, వాటికి సంబంధించిన ధరలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, 62 మంది రైతులు పాల్గొన్నారు.

Spread the love